‘చక్కా జామ్‌’ : 50 వేల మందితో భారీ భద్రత

 Chakka Jam :50000Personnel, Water Cannons at Delhi - Sakshi

దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్‌ మోర్చా 'చక్కా జామ్‌'

స్కూల్‌ బస్సులు, అంబులెన్స్‌లకు మినహాయింపు

అత్యంత సయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితి పిలుపు

సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పదమైన మూడు వ్యవసాయ వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా చేపట్టిన నిరసన కార్యక్రమంలో నేటి (శనివారం) కార్యాచరణ కీలకంగా మారనుంది. దేశవ్యాప్తంగా రహదారుల దిగ్బంధనానికి ‘చక్కా జామ్‌' పేరుతో సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఆందోళన  చేపట్టనున్నారు. రిపబ్లిక్ డే ట్రాక్టర్ ర్యాలీ తర్వాత తలపెట్టిన అతిపెద్ద నిరసన కార్యక్రమంగా చక్కా జామ్‌ నిలవనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో భదత్రను కట్టుదిట్టం చేశారు.  ఘాజీపూర్‌, టిక్రీ, సింగు వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.

ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్ మినహా మిగితా దేశమంతా చక్కా జామ్ ఉంటుందని భారతీయ కిసాన్ యూనిన్ నేత రాకేశ్ తికాయిత్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కొందరు హింసకు పాల్పడే అవకాశం ఉన్నందున ఈ మూడు రాష్ట్రాల్లో బంద్‌ను వాయిదా వేసినట్లు చెప్పారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న ప్రాంతాలు మినహా ఢిల్లీలో ఎక్కడా చక్కా జామ్ ఉండదని స్పష్టం చేశారు. చక్కాజామ్‌ ముగియడానికి ముందు ఒక నిమిషం పాటు వాహనాలతో హారన్‌ కొట్టి రైతులకు సంఘీభావం తెలుపుతామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై నిరసనలు శాంతియుతంగా కొనసాగనున్నాయని తెలిపారు. ఎటువంటి ఘర్షణలకు, వాగ్వాదాలకు పాల్పడవద్దని ఆందోళనకారులకు సూచించారు.  అలాగే అంబులెన్సులు, స్కూల్ బస్సులను ఈ నిరసననుంచి మినహాయింపు నిస్తున్నట్టు సంయుక్తి కిసాన్ మోర్చా స్పష్టం చేసింది.  'చక్కా జామ్‌'  కార్యక్రమానికి కాంగ్రెస్‌ మద్దతు ప్రకటించింది. ఈ కార్యక్రమంలో ఇరువురూ అత్యంత సంయమనం పాటించాలని అటు అధికారులు, ఇటు ఆందోళనకారులకు ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది.

మరోవైపు 50 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. గణతంత్ర దినోత్సవం రోజు ట్రాక్టర్ ర్యాలీలో జరిగిన ఘటనల నేపథ్యంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో పారామిలిటరీ, రిజర్వ్‌ దళాలను మోహరించారు. వాటర్‌కెనాన్లను సిద్ధం చేశారు. 12 మెట్రో స్టేషన్ల వద్ద హై అలర్ట్‌ ప్రకటించారు. కొన్నింటిని మూసివేశారు. పలు ప్రాంతాల్లో వాటర్‌ కెనాన్లను సిద్ధం చేయడంతో పాటు డ్రోన్ల ద్వారా పోలీసులు నిఘా పెట్టారు.  గత 70 రోజులగా  కొత్త సాగుచట్టల డిమాండ్‌తో ఢిల్లీలోని సింఘు, తిక్రి, ఘాజీపూర్ సరిహద్దుల్లో రైతుల ఆందోళన చేస్తున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top