కొత్త పోస్టులను సృష్టించడానికి అనుమతి లేదు: కేంద్రం

Centre Says No Ban On Hiring For Government Jobs - Sakshi

స్టాఫ్ సెలక్షన్ కమిషన్,  ఆర్ఆర్బీ , యూపీఎస్సీ ద్వారా యధావిధిగా నియామకాలు

కొత్త పోస్టులను సృష్టించడానికి అనుమతి లేదు: కేంద్రం

సాక్షి, న్యూఢిల్లీ: కొత్తగా ఉద్యోగ నియామకాలను చేపట్టవద్దని ఎలాంటి నిషేధం విధించలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ వనరులపై ఒత్తిడిని తగ్గించే ఉద్దేశ్యంతో కేంద్ర మంత్రిత్వ శాఖలలో కొత్త పోస్టులను సృష్టించడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మరుసటి రోజు తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం స్పష్టం చేసింది. కొత్త పోస్టుల బ్యాన్‌పై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ  ప్రకటన వెలువడటం గమనార్హం. శనివారం జారీ చేసిన కొత్త సర్క్యులర్‌లో వివిధ ప్రభుత్వ సంస్థల ద్వారా సాధారణ నియామక ప్రక్రియ కొనసాగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. శుక్రవారం నాటి సర్క్యులర్‌లో ‘మంత్రిత్వ శాఖలు / విభాగాలు, అటాచ్డ్ కార్యాలయాలు, సబార్డినేట్ కార్యాలయాలు, చట్టబద్దమైన సంస్థలు, స్వయంప్రతిపత్తి గల సంస్థలలో ఖర్చుల శాఖ ఆమోదంతో మినహా కొత్త పోస్టుల సృష్టిపై నిషేధం’ అని పేర్కొన్నది. దీనిపై విపక్షాలు మండిపడ్డాయి. ఈ క్రమంలో ఇవాళ ఆర్థిక శాఖ మరో సర్క్యులర్‌ జారీ చేసింది. (చదవండి: యువత సమస్యలపై ప్రభుత్వానికి నిజాయితీ లేదు)

దానిలో ‘భారత ప్రభుత్వంలో పోస్టులను భర్తీ చేయడానికి ఎటువంటి పరిమితి, నిషేధం లేదు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ), యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బీ) వంటి ప్రభుత్వ సంస్థల ద్వారా సాధారణ నియామకాలు ఎటువంటి అడ్డంకులు లేకుండా యథావిధిగా కొనసాగుతాయి’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కాగా, ‘సెప్టెంబర్ 04 నాటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ సర్క్యులర్ పోస్టుల సృష్టి కోసం అంతర్గత విధానంతో వ్యవహరిస్తుందని, నియామకాలను ఏ విధంగానూ ప్రభావితం చేయదు.. తగ్గించదు’ అని పేర్కొన్నది.  దేశంలో పేదరికం, నిరుద్యోగం, పెరిగిపోయాయని, యువతరానికి ఉపాధి కల్పనలో ప్రభుత్వానికి నిజాయితీ లేదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించిన సంగతి తెలిసిందే. పోటీ పరీక్షల దరఖాస్తు ఫారాలను అమ్మి, కోట్ల రూపాయలను వసూలు చేస్తున్నారనీ, అయితే పరీక్షలు మాత్రం నిర్వహించడం లేదని, కొన్ని పరీక్షలు నిర్వహించినప్పటికీ, నెలలు గడుస్తున్నా ఫలితాలను ప్రకటించడం లేదని రాహుల్‌ ఆరోపించారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top