
క్వెట్టా: పాకిస్తాన్‌లో బాంబు పేలుడు చోటుచేసుకుంది. బలూచిస్తాన్‌లోని క్వెట్టాలో బలూచిస్తాన్ నేషనల్ పార్టీ (బీఎన్‌పీ) ర్యాలీ నిర్వహిస్తున్న సందర్భంలో జరిగిన భారీ పేలుడులో 14 మంది మృతిచెందారు. 35 మంది గాయపడ్డారు. మంగళవారం సాయంత్రం బలూచ్ నేత సర్దార్ అత్తౌల్లా మెంగల్ నాల్గవ వర్ధంతి కార్యక్రమం ముగిసిన కొద్ది క్షణాలకే షావానీ స్టేడియం సమీపంలో పేలుడు సంభవించింది. బలూచిస్తాన్ ఆరోగ్య మంత్రి బఖ్త్ ముహమ్మద్ కాకర్ ఈ ఘటనను ధృవీకరించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీఎన్‌పీ చీఫ్ అక్తర్ మెంగల్, అతని కాన్వాయ్ లక్ష్యంగా దాడి జరిగింది. అయితే మెంగల్ దాడి నుంచి తప్పించుకున్నారు. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై, ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. పేలుడులో 13 మంది పార్టీ సభ్యులు మరణించారని బీఎన్‌పీ ప్రతినిధి సాజిద్ తరీన్ తెలిపారు. అక్తర్ మెంగల్ వాహనం అక్కడి నుంచి దాటిన క్షణంలో భారీ పేలుడు సంభవించిందని తరీన్ తెలిపారు.
Thank you for your prayers and messages. Alhumdulillah I am safe, but deeply heartbroken at the loss of our workers. Around 15 have been martyred and many injured. They stood by me and gave their lives for our cause. Their sacrifice will never be forgotten. May Allah grant them…
— Akhtar Mengal (@sakhtarmengal) September 2, 2025
పేలుడుకు గల ఖచ్చితమైన కారణాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇది ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)వల్ల జరిగిందా లేదా ఆత్మాహుతి దాడా? అనేది ఇంకా నిర్ధారణకాలేదు. అక్తర్ మెంగల్ ఈ ఘటనపై స్పందిస్తూ.. పార్టీ కార్యకర్తల మృతిపై విచారం వ్యక్తం చేశారు. అల్లా దయవల్ల తాను సురక్షితంగా ఉన్నానని తెలిపారు. బలూచిస్తాన్ ముఖ్యమంత్రి మీర్ సర్ఫ్రాజ్ బుగ్టి ఈ దాడిని ఖండించారు. ఇది శాంతి శత్రువుల పిరికి చర్య అని పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై దర్యాప్తు చేసి, నివేదిక సమర్పించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.