బీజేపీ పంచతంత్రం  | BJP wins election in West Bengal for the first time | Sakshi
Sakshi News home page

బీజేపీ పంచతంత్రం 

May 5 2026 4:58 AM | Updated on May 5 2026 4:58 AM

BJP wins election in West Bengal for the first time

బెంగాల్‌లో బీజేపీకి అండగా నిలిచిన మహిళలు, మథువాలు 

 కాషాయం పార్టీకి ఓటువేసిన బెంగాలీ వలసదార్లు 

 విస్తృత ప్రచారంతో బలం పెంచుకున్న బీజేపీ 

పశ్చిమ బెంగాల్‌లో 15 ఏళ్ల తృణమూల్‌ కాంగ్రెస్‌ పాలనను కమలం పార్టీ కూలదోసింది. మెజార్టీ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు పొరపాటని రుజువు చేస్తూ ఊహించని విజయం దక్కించుకుంది. వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావాలన్న ‘దీదీ’మమతా బెనర్జీ ఆశయం నెరవేరలేదు. ‘మా, మాటీ, మానుష్’నినాదాన్ని ఈసారి బెంగాలీలు విశ్వసించలేదు. 

34 ఏళ్లపాటు అవిచ్ఛిన్నంగా సాగిన కమ్యూనిస్టుల పరిపాలనను అంతం చేసి 2011లో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ 15 ఏళ్ల తర్వాత పరాజయం పాలయ్యారు. ఈ ఎన్నికల ఫలితాలను నిర్దేశించడంలో ప్రధానంగా ఐదు కారణాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో మహిళలు, ముస్లింలు, వలసదార్లు, హిందూ మతస్థులైన మథువా సామాజికవర్గం, బీజేపీ యంత్రాంగం కీలక పాత్ర పోషించింది. రాష్ట్రంలో తమ పార్టీకి ప్రధాని మోదీ ఏకైక ఆకర్షణగా నిలిచారు. ప్రచారంలో అంతా తానై వ్యవహరించారు. 

పార్టీకి ఆయనే అతిపెద్ద ఆశాకిరణంగా మారారు. గెలుపు బాధ్యతను భుజాన వేసుకొని పనిచేశారు. పార్టీ యంత్రాంగాన్ని ముందుకు నడిపించారు. విజయంలో ఆయనకు సింహభాగం వాటా దక్కుతుందని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. మరోవైపు స్ట్రీట్‌ ఫైటర్‌ అనే ఇమేజ్‌తో సీఎం మమతా బెనర్జీ దేశ రాజకీయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే, ఈసారి తన రాజకీయ జీవితంలోనే అత్యంత కఠినమైన పరీక్షను ఎదుర్కొన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడం, ఎస్‌ఐఆర్‌ ద్వారా 90 లక్షల ఓట్లు తొలగింపునకు గురికావడం, హిందూ ఓటు బ్యాంకు బీజేపీ వెనుక సంఘటితం కావడం, శాంతి భద్రతలు దిగజారడం వంటివి తృణమూల్‌ను ఓడించాయి.  

మహిళలు
బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఇన్నాళ్లూ మహిళలే వెన్నుముకగా నిలిచారు. ఆ పార్టీ వరుసగా మూడుసార్లు గెలిచిందంటే మహిళల ఆదరణే ప్రధాన కారణం. వారి సంక్షేమం కోసం మమతా బెనర్జీ ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొచ్చింది. ఇందులో ముఖ్యమైనది ‘లక్ష్మీ భండార్‌’. ఈ పథకం కింద పేద మహిళల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేశారు. చదువుకొనే బాలికలను ప్రోత్సహించడానికి, బాల్య వివాహాలను అరికట్టడానికి కన్యాశ్రీ పథకాన్ని అమలు చేశారు. కానీ, కోల్‌కతాలో ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో వైద్య విద్యార్థిపై అత్యాచారం, హత్య ఘటన టీఎంసీ సర్కార్‌పై మాయని మచ్చగా మిగిలిపోయింది.

 రాష్ట్రంలో మహిళలపై వేధింపులు పెచ్చుమీరాయి. దీంతో ప్రభుత్వంపై మహిళల్లో వ్యతిరేకత పెరిగింది. పరిస్థితిని గమనించిన బీజేపీ మహిళలను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేసింది. తాము అధికారంలోకి వస్తే ఆడబిడ్డలకు భద్రత కల్పిస్తామని, వారి సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చింది. మేనిఫెస్టోలో మహిళా సంక్షేమ పథకాలు ప్రకటించింది. అంతేకాకుండా ఆర్‌జీకర్‌ ఆసుపత్రి ఘటనలో బలైపోయిన విద్యార్థిని తల్లిని బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దించారు. ఇవన్నీ బీజేపీ పట్ల మహిళల్లో సానుకూలత పెంచాయి.  

ముస్లింలు
బెంగాల్‌ జనాభాలో ఏకంగా 27 శాతం ఉన్న ముస్లింలు ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా మారారు. వారంతా తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి గట్టి మద్దతుదార్లు. 30 శాతం నుంచి 90 శాతం దాకా ముస్లిం జనాభా ఉన్న నియోజవకర్గాలు 146 ఉండగా, 2021లో టీఎంకే 131 స్థానాలు గెల్చుకుంది. గత 15 ఏళ్లుగా మెజార్టీ సీట్లు దక్కించుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌(ఎన్‌ఆర్‌సీ) వంటి ముస్లింలలో భయాన్ని పెంచాయి. బెంగాల్‌లో అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అమలు చేస్తామని బీజేపీ హామీ  ఇచ్చింది. ఈ పరిణామాల వల్ల ముస్లింలు ఈసారి కూడా అండగా నిలవడంతో దీదీ పార్టీ చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు        గెల్చినట్లు స్పష్టమవుతోంది. మైనార్టీల అండ లేకపోయినా హిందువులు తమకు అనుకూలంగా ఓట్లు సంఘటితం కావడం బీజేపీకి కలిసొచ్చింది.  

వలసదార్లు
బెంగాల్‌లో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేక స్థానికులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లడం పరిపాటి. ఈ వలసదార్లు అత్యంత ప్రభావవంతమైన వర్గంగా మారిపోయారు. చాలాస్థానాల్లో ఫలితా లను నిర్దేశించేది వారేనంటే అతిశయోక్తి కాదు. ఈసారి ఓటర్ల జాబితాలో పేర్లు ఉండటానికి, చట్టబద్ధమైన నివాసితులుగా గుర్తింపు పొందడానికి ఓటు వేయడం తప్పనిసరి అనే ప్రచారం జరిగింది. అందుకే ఇతర రాష్ట్రాల్లో ఉన్న బెంగాలీ వలస కార్మికులు, ఇతర వృత్తి నిపుణులు ఓటు వేయడానికి పెద్ద సంఖ్యలో సొంత రాష్ట్రానికి తిరిగి వచ్చారు. స్థానికంగానే ఉద్యోగా లు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ బీజేపీ ఇవ్వ డం వలసదార్లను ఆకర్శించింది. అందుకే వారు ఆ పార్టీకి అనుకూలంగా ఓటు వేసినట్లు తెలుస్తోంది.

మథువాలు
దళితులైన మథువాలు హిందువులే. వీరు రాష్ట్ర జనాభాలో 17% దాకా ఉంటారు. బీజేపీకి మద్దతుగా నిలిచారు. పొరుగుదేశాల్లో మత హింసకు గురై శరణార్థులుగా వచ్చిన మథువాలకు భారత పౌరసత్వం కల్పిస్తామని బీజేపీ ప్రకటించింది. బెంగాల్‌లో అట్టడుగున ఉన్న బీజేపీ గత ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానానికి చేరుకోవడానికి కారణం మథువాల మద్దతే. ప్రస్తుత ఎన్నికల్లోనూ వారు బీజేపీని బలపర్చారు.  

బీజేపీ యంత్రాంగం
బెంగాల్‌లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగింది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు చాపకిందనీరులా చొచ్చుకొచ్చారు. గత రెండేళ్లుగా ఇంటింటి ప్రచారం, ప్రతి ఓటర్‌ను కలవడం వంటి కార్యక్రమాలతో పార్టీని బలోపేతం చేశారు. బూత్‌స్థాయిలో ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు సైతం తరలిరావడం గమనార్హం.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
 
Advertisement
Advertisement