Partition Of India And Pakistan: విభజనకు ఏఐసీసీ ఓకే చెప్పిన రోజు

Azadi Ka Amrit Mahotsav: Partition Of India And Pakistan - Sakshi

భారతదేశానికి ఆగస్టు 15 ఎంత ప్రధానమైనదో, జూన్‌ 15 కూడా అదే విధంగా గుర్తుంచుకోదగ్గది. ఇండియాను విభజించేందుకు భారత జాతీయ కాంగ్రెస్‌ అంగీకరించిన రోజు ఇది. విభజన వాదంతో భారత్‌ రక్తమోడుతున్న క్షణాలలో 1947 మార్చి 22న మౌంట్‌బాటన్‌ భారత్‌లో అడుగుపెట్టాడు. వెంటనే నేతలతో చర్చించాడు. విభజనకి గాంధీజీ అంగీకరించలేదు. ఆ వేసవిలో నెహ్రూను సిమ్లాకు ప్రత్యేక అతిథిగా పిలిచి విభజన ప్రణాళికను ఆయన ముందుంచాడు వైస్రాయ్‌. నెహ్రూ మండిపడ్డాడు. తరువాత విభజన పట్ల కాస్త మెత్తబడినా మిగిలిన విషయాలకు జాతీయ కాంగ్రెస్‌ నేతలు వ్యతిరేకంగానే ఉన్నారు.
చదవండి: ఎడిటర్‌కి ఎనిమిదేళ్ల జైలు!.. రెండేళ్లకే పేపర్‌ మూత!!

దీనితో తన వ్యక్తిగత సిబ్బందిలోని ఏకైక భారతీయుడు వీపీ మేనన్‌ (రాజ్యాంగ వ్యవహారాల సలహాదారు)ను కొత్త ప్రణాళిక తయారు చేయమని మౌంట్‌బాటన్‌ ఆదేశించాడు. ఆ ప్రణాళికను తీసుకుని మౌంట్‌బాటన్‌ లండన్‌ వెళ్లాడు. దీనిలో కీలకాంశమూ విభజనే. దీనిని ఆమోదించడానికి అట్లీ మంత్రిమండలి తీసుకున్న సమయం ఐదు నిమిషాలే! మే 31న మౌంట్‌బాటన్‌ భారత్‌ తిరిగి వచ్చాడు. మళ్లీ చర్చలు. పటేల్, రాజాజీ వంటివారు ప్రత్యామ్నాయం లేదని అభిప్రాయపడ్డారు.

ఇది తక్కువ ప్రమాదకరమైన ఆలోచన అన్నారు నెహ్రూ. 1947 జూన్‌ 2న వైస్రాయ్‌ హౌస్‌ (నేటి రాష్ట్రపతి భవన్‌)లో సమావేశం. అది జరగడానికి రెండు మూడు గంటల ముందు కూడా విభజనకు జిన్నా సైతం అంగీకరించలేదు. ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలతో పాటు అస్సాం కూడా పాకిస్తాన్‌లో ఉండాలని ఆయన కోరిక. మొత్తం తొమ్మిది మంది విభజన ప్రణాళిక /మౌంట్‌బాటన్‌ పథకానికి ఆమోదముద్ర వేశారు. విభజనతో కూడిన బదలీ గురించి జూన్‌ 3 న రేడియోలో మౌంట్‌బాటన్, నెహ్రూ, జిన్నా, బల్‌దేవ్‌ సింగ్‌ అధికారికంగా వెల్లడించారు. ఆ సాయంత్రమే బ్రిటిష్‌ పార్లమెంట్‌ దిగువ సభ ఆమోదించింది. జూన్‌ 15 న వాగ్వాదాల మధ్య ఏఐసీసీ కూడా అంగీకరించింది. ఆ సమయంలో అక్కడ గాంధీజీ లేరు. మౌట్‌ బాటన్‌ అభీష్టం మేరకు భారతీయ నేతలు గాంధీజీని సమావేశానికి ఆహ్వానించ లేదు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top