మహోజ్వల భారతి: చిరునవ్వుతో ఉరికంబానికి!

Azadi Ka Amrit Mahotsav: Indian revolutionary Khudiram Bose Death Anniversary - Sakshi

ఖుదీరాం బోస్‌ భారత స్వాతంత్య్ర సమరవీరులలో మొదటి తరానికి చెందిన అతి పిన్నవయస్కుడు. బ్రిటిష్‌ అధికారిపై బాంబు వేసిన మొదటి సాహసవీరుడు. బాంబు వేసిన కారణంగానే అతడిని ఉరి తీసేనాటికి అతని వయసు కేవలం 18 సంవత్సరాలు. ఖుదీరాం పశ్చిమ బెంగాల్, మిడ్నాపూర్‌ జిల్లా హబిబ్‌పూర్‌లో 1889 డిసెంబర్‌ 3న జన్మించాడు. తల్లిదండ్రులు ఇద్దరూ ఖుదీరాం చిన్నవయస్సులోనే కన్నుమూశారు. ఖుదీరాం పాఠశాలలో చదువుతున్న రోజుల్లో స్వాతంత్య్ర సమర యోధుల గురించి విని జాతీయోద్యమానికి ప్రభావితుడయ్యాడు.

నిరంతరం తీవ్రమైన స్వాతంత్య్ర సాధనేచ్ఛతో రగిలిపోతుండే వాడు. మొదట్లో ‘అఖ్రా’ అనే విప్లవ సంస్థలో చేరాడు. 1905లో బెంగాల్‌ విభజన ఖుదీరాంలో బ్రిటిష్‌ ప్రభుత్వంపై మరింత కసి రేపింది. 16 ఏళ్ల వయసులోనే ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్‌ స్టేషన్‌లను బాంబులతో పేల్చివేశాడు. ఆ తర్వాత ఒక ఘటన జరిగింది. 1907 ఆగస్టు 26న ఒక కేసు విచారణ సందర్భంగా అనేకమంది యువకులు కోర్టు ముందర ఆసక్తిగా గుమికూడి ఉన్నారు. పరిస్థితి శాంతియుతంగా ఉన్నప్పటికీ ఉన్నట్లుండి పోలీసులు లాఠీలకు పనిచెప్పారు.

ఈ వ్యవహారాన్ని కొద్దిదూరంలో నిలబడి చూస్తున్న సుశీల్‌ కుమార్‌ సేన్‌ అనే 15 ఏళ్ల యువకుడు ఈ దాడిని చూసి భరించలేక ఆవేశంతో ఒక ఇంగ్లిషు అధికారి ముక్కు మీద ఒక్క గుద్దు గుద్దాడు. వెంటనే పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్‌ చేసి కోర్టుకు తీసుకెళ్లారు. ఈ కేసు విచారణ చేసిన జడ్జి కింగ్స్‌ఫోర్డ్‌ అనే అధికారి. భారతీయులపట్ల క్రూరత్వానికి అతడు పెట్టింది పేరు. ‘యుగాంతర్‌ ’ పత్రిక మీద అతను ఎప్పుడూ ప్రతికూల నిబంధనలు  విధిస్తూ, ఆ పత్రికా కార్యకర్తలకు నరకయాతన పెట్టేవాడు. చిన్నవాడన్న దయ లేకుండా సుశీల్‌ కుమార్‌కు జడ్జి 15 కొరడాదెబ్బలను శిక్షగా విధించాడు. కానీ సాహసవంతుడైన ఆ యువకుడు ప్రతి కొరడాదెబ్బకు వందేమాతరం అని నినదిస్తూనే ఉన్నాడు.

ఈ ఘటన తరువాత స్వతంత్ర వీరులంతా కింగ్స్‌ఫోర్డ్‌కు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారు. 1908 ఏప్రిల్‌ మొదటివారంలో యుగాంతర్‌ విప్లవ సంస్థకి చెందిన విప్లవ కారులు కొందరు కలకత్తాలో ఒక ఇంటిలో రహస్యంగా సమావేశమై కింగ్స్‌ఫోర్ట్‌ ను అంతం చెయ్యడానికి ఒక ప్రణాళిక రచించారు. ఆ సమావేశంలో అరవిందఘోష్‌ కూడా ఉన్నాడు. ఖుదీరాం బోస్‌ను, ప్రఫుల్లచాకి అనే మరో నవ యువకుడినీ ఈ పనికై నియమించారు. 1908 ఏప్రిల్‌ 30 రాత్రివేళ వీరిద్దరూ ముజఫర్‌పూర్‌ లోని యురోపియన్‌ క్లబ్‌ కు ఒక బాంబు, రివాల్వర్‌ తీసుకొనివెళ్లారు. కింగ్స్‌ఫోర్డ్‌ క్లబ్‌ వాహనం బయటకు రాగానే దానిపై బాంబును విసిరేసి ఇద్దరు చెరో దిక్కుకు పరిగెత్తి వెళ్లిపోయారు.

అయితే ఆ వాహనంలో కింగ్స్‌ఫోర్డ్‌ లేడు. అతని భార్య, కుమార్తెలు మాత్రమే ఉన్నారు. ఆ తరువాత ఒక రైల్వే స్టేషన్‌లో టీ తాగుతుండగా ఖుదీరాం బోస్‌ను పోలీసులు పట్టుకోగలిగారు. ఖుదీరాంను నిర్బంధించి రెండునెలలపాటు విచారణ చేశారు. ముజఫర్‌పూర్‌ బాంబు కేసులో ఫోర్డ్‌ భార్య, కుమార్తెల మరణానికి కారకుడైన ఖుదీరాంకు మరణశిక్ష విధించారు. 1908 ఆగస్టు 11న ఈ శిక్ష అమలైంది. పెదవులపై చిరునవ్వు చెదరకుండా ఖుదీరాం మృత్యువును ఆహ్వానించాడు. దేశం కోసం బలిదానం చేశాడు. నేడు ఖుదీరాం వర్ధంతి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top