అన్నాడీఎంకేలో చీలిక!? | AIADMK split over TVK: 36 MLAs hold secret Meeting | Sakshi
Sakshi News home page

అన్నాడీఎంకేలో చీలిక!?

May 10 2026 5:32 AM | Updated on May 10 2026 5:32 AM

AIADMK split over TVK: 36 MLAs hold secret Meeting

36 మంది ఎమ్మెల్యేల రహస్య మంతనాలు

సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో తాజా అసెంబ్లీ ఎన్నికల ఓటమి పరిస్థితులు మళ్లీ చీలికకు దారి తీస్తాయా అన్న చర్చ ఊపందుకుంది. శనివారం పరిణామాలు ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. 36 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామితో సమావేశానంతరం ప్రత్యేక శిబిరంగా ఏర్పాటై సమాలోచనలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అన్నాడీఎంకే సీనియర్‌ నేతలు, ఎమ్మెల్యేలు సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి, విజయ భాస్కర్, మహిళా ఎమ్మెల్యే లీమా రోజ్‌ సహా 36 మంది చెన్నై ఎంఆర్‌సీ నగర్‌లో సమావేశం కావడంతో అన్నాడీఎంకేలో చీలిక వస్తోందన్న చర్చ జోరందుకుంది. వీరంతా సీవీ షణ్ముగం కార్యాలయంలో సమావేశమయ్యారు.

ఆయన ఆది నుంచి టీవీకేకు మద్దుతిద్దామని, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని చెబుతున్నట్లు తెలుస్తోంది. కీలక నిర్ణయం తీసుకునేందుకే ఈ సమావేశమైనట్టుగా చర్చ ఊపందుకుంది. పళణి స్వామికి వ్యతిరేకంగా వ్యవహరించినా, తమపై ఎలాంటి క్రమ శిక్షణ చర్య తీసుకునేందుకు వీల్లేని విధంగా ఇంత పెద్ద సంఖ్యలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఒక చోట చేరినట్టుగా సంకేతాలు  వెలువడ్డాయి. అదే సమయంలో వీరంతా టీవీకేకు మద్దతు ఇవ్వొచ్చని, రానున్న కాలంలో విజయ్‌కు ఏదేని గడ్డు పరిస్థితులు ఎదురైనా అండగా నిలవొచ్చన్న చర్చ సాగుతోంది. అదే సమయంలో అన్నాడీఎంకే నుంచి ఎవరు వచ్చినా పదవికి రాజీనామా చేసే టీవీకేలోకి ఆహ్వానించాలన్న స్పష్టమైన ఆదేశాలను టీవీకే ముఖ్య నేతలకు విజయ్‌ జారీ చేసినట్టు తెలుస్తోంది. కాగా, విజయ్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా పళణిస్వామి శుభాకాంక్షలు తెలిపారు.  

నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటాం: స్టాలిన్‌
నూతన ప్రభుత్వానికి  డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలని, అందుకే కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తాము ఎలాంటి అడ్డంకులు సృష్టించబోమని స్పష్టం చేశారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని చెప్పారు.  

Advertisement
 
Advertisement
Advertisement