రైతులను గోసపెడుతున్న కాంగ్రెస్‌ | - | Sakshi
Sakshi News home page

రైతులను గోసపెడుతున్న కాంగ్రెస్‌

Jun 21 2026 7:10 AM | Updated on Jun 21 2026 7:10 AM

నారాయణపేట: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ.. అన్నదాతలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి ఆరోపించారు. శనివారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేయగా.. ప్రస్తుత కాంగ్రెస్‌ పాలనలో రైతులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారన్నారు. ఎరువులు, యూరియా ధరలు పెరగడమే కాకుండా సకాలంలో అందడం లేదన్నారు. రైతు బీమా ప్రీమియం చెల్లింపులు నిలిచిపోయాయని.. రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి రెండున్నరేళ్లలో రూ. 2.50లక్షల కోట్లు అప్పులు చేశారని, వాటిని ఎక్కడ వినియోగించారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ నెల 30న విడుదల చేయనున్న రైతుభరోసా నిధులు ఈ వానాకాలానికి సంబంధించినవా.. లేక గత యాసంగి బకాయిలా? అనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. ఎన్నికల సమయంలో అన్ని పంటలను కొనుగోలు చేస్తామని ఇచ్చి.. ఇప్పుడు కేంద్రం కొనుగోలు చేయాలంటూ బాధ్యత నుంచి తప్పించుకోవడం సరైంది కాదన్నారు. చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో మాజీ ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్లు భరత్‌, నారాయణమ్మ, బీఆర్‌ఎస్‌ నాయకులు విజయ్‌ సాగర్‌, వేపూరి రాములు, వెంకట్‌రెడ్డి, సుభాష్‌, తిరుపతయ్య, చెన్నారెడ్డి, నర్సప్ప, గురునాథ్‌గౌడ్‌, సురేందర్‌రెడ్డి ఉన్నారు.

చదువుతోపాటు

యోగా అవసరం

దామరగిద్ద: ప్రతి విద్యార్థికి చదువుతోపాటు యోగా అవసరమని.. దైనందిన జీవితంలో యోగాను అలవాటు చేసుకోవాలని డీఈఓ గోవిందరాజులు అన్నారు. శనివారం మండలంలోని క్యాతన్‌పల్లి ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆయన.. విద్యార్థులకు యోగా ప్రాధాన్యతను వివరించారు. ఆదివారం ప్రతి పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని సూచించారు. యోగాతో శారీరక, మానసిక వికాసంతో పాటు ఆరోగ్యం, ఏకాగ్రత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయన్నారు. అనంతరం స్థానిక ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులకు పాఠ్య, నోట్‌ పుస్తకాలను అందజేశారు. డీఈఓ వెంట జీహెచ్‌ఎం సత్యనారాయణ, యాదయ్యశెట్టి, సీఆర్పీ రాములు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement