
మిగిలింది ఒక్కరోజే!
జిల్లాలో ఇదీ పరిస్థితి..
చేపపిల్లల సరఫరాకు టెండర్ల దాఖలుపై సందిగ్ధం
● ఆగస్టు 18న నోటిఫికేషన్ జారీ..
ముందుకురాని వ్యాపారులు
● మరోసారి టెండర్లు
ఆహ్వానించిన అధికారులు
● నేటి మధ్యాహ్నం 3గంటల వరకు గడువు
● చేపపిల్లల పంపిణీ ఆలస్యంతో మత్స్యకారుల్లో ఆందోళన
చేప పిల్లలను జూలై, ఆగస్టులో పంపిణీ చేస్తే బాగా పెరిగేవి. సెప్టెంబర్, అక్టోబర్‌లో పంపిణీ చేయడం వల్ల ఆశించిన స్థాయిలో పెరగవు. మత్స్యకారులకు నగదు రూపంలో ఇస్తే సకాలంలో చేపపిల్లలను కొనుగోలు చేసి చెరువుల్లో వదులుకునేందుకు అవకాశం ఉంటుంది.
– ఆంజనేయులు, మత్స్య సహకార సంఘం డైరెక్టర్, మాగనూర్
ప్రభుత్వం గతేడాది కూడా సకాలంలో చేప పిల్లలను సరఫరా చేయలేదు. మత్స్యసహకార సంఘం ఆధ్వర్యంలో సొంత డబ్బులు రూ. 9లక్షలతో 3లక్షల చేప పిల్లలను కొనుగోలుచసి ఊట్కూరు పెద్ద చెరువులో వదిలాం. ఈ ఏడాది చెరువు అలుగు పారి పక్షంరోజులు అవుతుంది. ఇప్పటివరకు ప్రభుత్వం చేప పిల్లలను పంపిణీ చేయలేదు. ఆలస్యంగా వదిలితే ఆశించిన స్థాయిలో చేప పెరగదు.
– ఎం.నరేశ్‌కుమార్,
మత్స్య సహకార సంఘం డైరెక్టర్, ఊట్కూర్
ప్రభుత్వ ధరకు చేప పిల్లలను సరఫరా చేసేందుకు గాను రాష్ట్ర మత్స్యశాఖ మరోసారి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు ఆన్‌లైన్‌లో టెండర్లు దాఖలు చేయవచ్చు. ఇదే రోజు 3:30 గంటలకు టెండర్లు ఓపెన్ చేస్తారు.
– రహిమాన్, జిల్లా మత్స్యశాఖ అధికారి
నారాయణపేట: మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఉచితంగా చేపపిల్లలు పంపిణీ చేస్తోంది. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఏప్రిల్, మేలో మొదలై.. జూలై నుంచి ఆగస్టు చివరి వరకు జలాశయాలు, చెరువుల్లో నీటినిల్వ సామర్థాన్ని బట్టి చేపపిల్లలు వదిలేవారు. కానీ ఈ ఏడాది చేపపిల్లల పంపిణీ ప్రక్రియ మరింత ఆలస్యమైంది. ఇందుకు గుత్తేదారులు ముందుకు రాకపోవడమే కారణంగా తెలుస్తోంది. జిల్లాలోని జలాశయాల్లో చేపపిల్లల పంపిణీ కోసం ఆగస్టు 18న నోటిఫికేషన్ జారీ చేసి.. 30వ తేదీ వరకు గడువు విధించారు. గుత్తేదారులు ఎవరూ ముందుకు రాకపోవడంతో మరోసారి టెండర్లు ఆహ్వానించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్లు దాఖలకు గడువు విధించారు.
ముందుకురాని వ్యాపారులు..
చేపపిల్లల సరఫరాకు సంబంధించి వ్యాపారుల నుంచి టెండర్లు ఆహ్వానిస్తున్నారు. బిడ్ డాక్యుమెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకొని బిడ్ దాఖలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు వ్యాపారులు ముందుకు వస్తారో లేదో అనే చర్చ కొనసాగుతోంది. గతేడాది చేప పిల్లలను సరఫరా చేసిన వ్యాపారులకు రాష్ట్రవ్యాప్తంగా బిల్లులు చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, స్థానికంగా ఉత్పత్తి చేసిన చేప పిల్లలను మాత్రమే సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో టెండర్ల దాఖలుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. గతంలో స్థానికంగా ఉత్పత్తి చేయకుండా.. పొరుగు రాష్ట్రాల నుంచి చేపపిల్లలను దిగుమతి చేసుకోవడంతో ఆశించిన మేర దిగుబడులు రాక మత్స్యకారులకు నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. మరోవైపు నిబంధనలకు తిలోదకాలిస్తూ నాణ్యతలేని చేప పిల్లలను పంపిణీ చేస్తూ మమ అనిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో రెండు రిజర్వాయర్లు, 642 చెరువులు, కుంటలు ఉన్నాయి. చెరువుల్లో 35–40 ఎం.ఎం. చేపపిల్లలు 1.02కోట్లు వదిలేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మరో 82లక్షల 80–100 ఎం.ఎం. చేపపిల్లలు సరఫరా చేయాల్సి ఉంది. ఇందుకు గాను వ్యాపారుల నుంచి టెండర్లు ఆహ్వానించారు. జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువుల్లో చేపపిల్లలను వదలడం వల్ల 147 మత్స్య పారిశ్రామిక సంఘాల్లోని 11,039 సభ్యులకు జీవనోపాధి లభించనుంది. ఇందులో 6 మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా.. 421 మంది సభ్యులు ఉన్నారు.

మిగిలింది ఒక్కరోజే!

మిగిలింది ఒక్కరోజే!