
బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి
నారాయణపేట రూరల్: రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై చట్టబద్ధత కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుపల్లి కృష్ణయాదవ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవన్‌లో శనివారం నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ దళపతి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పోరాట ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో బీసీ డిక్లరేషన్ చేసిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలపై ప్రేమ లేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కంటి తుడుపు చర్యగా కాకుండా చట్టబద్ధతతో కూడిన 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. చట్టబద్ధత లేని ఆర్డినెన్స్‌ల ద్వారా బీసీలకు ఒరిగెదేమీ లేదని, గతంలో కేరళ, బీహార్ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచాలని చేసిన ప్రయత్నాన్ని కోర్టులు అడ్డుకున్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. రిజర్వేషన్లు పెంపును వ్యతిరేకంగా ఎవరైనా కోర్టుకు వెళితే ఎన్నికలు ఆగిపోతాయన్న విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియనిది కాదన్నారు. రిజర్వేషన్లు అమలు కాకముందే బీసీ సంక్షేమ శాఖ మంత్రి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేష్యాదవ్, జిల్లా అధ్యక్షుడు ఎడ్ల కుర్మయ్య, నియోజకవర్గ అధ్యక్షుడు గణేష్, వెంకటప్ప, గజలప్ప, రమేష్, నర్సింహులు, వెంకటయ్య, లక్ష్మప్ప, శ్రీనివాస్, రాము పాల్గొన్నారు.