
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు: ఎస్పీ
నారాయణపేట: రానున్న వానాకాలం సీజన్ నేపథ్యంలో రైతులు విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని, ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ యోగేష్‌గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు అందరూ సమన్వయంతో నాసీరకం ఎరువులు, నకిలీ విత్తనాలు సరఫరా జరగకుండా చూడాలని, రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత విత్తన సంస్థలు, డీలర్లు, వ్యాపారులపై ఉందని తెలిపారు. విత్తన వ్యాపార డీలర్లు బాధ్యతగా నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలని సూచించారు. రైతులకు, వ్యవసాయానికి నష్టం కలిగేలా నకిలీ విత్తనాలు విక్రయిస్తే అలాంటి వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని, పీడీ యాక్ట్ తప్పదని పేర్కొన్నారు. జిల్లా కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దుగా ఉండడంతో నకిలీ విత్తనాలు ఎక్కువగా సరఫరా అయ్యే అవకాశం ఉందని, ముందస్తు తనిఖీలు, రైతులకు అవగాహన కల్పిండంతో నకిలీ విత్తనాలు నివారించాలని సూచించారు. గతంలో నకిలీ విత్తనాల కేసుల్లో సంబంధం ఉన్న వారిపై నిఘా ఉంచాలని, నకిలీ విత్తనాలు సరఫరా చేసే అనుమానిత బ్రోకర్లు, డీలర్ల సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 100కు ఫోన్‌చేసి పోలీసులకు లేదా వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ తెలిపారు.
అలసందలు క్వింటాల్ రూ. 5,216
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం అలసందలు క్వింటాల్‌కు గరిష్టంగా రూ.5,216, కనిష్టంగా రూ.4,212 ధర పలికాయి. అలాగే, వడ్లు హంస గరిష్టంగా రూ.1,939, కనిష్టంగా రూ.1,736, వడ్లు సోనా గరిష్టంగా రూ.2,155, కనిష్టంగా రూ.1,529, ఎర్ర కందులు గరిష్టంగా రూ.6,575, కనిష్టంగా రూ.6,029, తెల్ల కందులు గరిష్ట, కనిష్టంగా రూ.5 వేలు ధర పలికాయి.
ఆర్‌ఎన్‌ఆర్ ధర రూ. 2084
దేవరకద్ర: మార్కెట్ యార్డులో మంగళవారం జరిగిన టెండర్లలో ఆర్‌ఎన్‌ఆర్ క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,084, కనిష్టంగా రూ.2,049, ఆముదాలు క్వింటాల్‌కు రూ.5,850 ఒకే ధర లభించింది. సీజన్ తగ్గడంతో మార్కెట్‌కు దాదాపు 300 బస్తాల ధాన్యం మాత్రమే అమ్మకానికి వచ్చింది.
మన్యంకొండలోవైభవంగా వసంతోత్సవం
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ అలివేలు మంగతాయరు దేవస్థానం సమీపంలో మహబూబ్‌నగర్– రాయిచూర్ అంతర్రాష్ట్ర రహదారి పక్కనున్న శ్రీలక్ష్మీనర్సింహస్వామి (ఓబులేశు) ఉత్సవాల్లో భాగంగా మంగళవారం వసంతోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అవబృత స్నానం తదితర పూజలు జరిపి.. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొన్నారు. అనంతరం పల్లకీలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. స్వామివారి పాదాలు, శఠగోపురానికి పురోహితులు సంప్రదాయబద్ధంగా స్నానం జరిపించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా సబ్ జూనియర్ నెట్‌బాల్ సెలక్షన్స్
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని డీఎస్‌ఏ మైదానంలో మంగళవారం సబ్ జూనియర్ ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాలకు సంబంధించి వేర్వురుగా బాల, బాలికల నెట్‌బాల్ సెలక్షన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ జనగాంలో ఈనెల 15 నుంచి 18 వరకు రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ నెట్‌బాల్ పోటీలు జరుగుతాయన్నారు. రాష్ట్రస్థాయి టోర్నీలో జిల్లా జట్లు ప్రతిభచాటాలని కోరారు. కార్యక్రమంలో ఖాజాఖాన్, అంజద్‌అలీ, షరీఫ్, షకీల్, అక్రం, సీనియర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు: ఎస్పీ