
ప్రశాంతంగా పాలిసెట్
నారాయణపేట రూరల్/కోస్గి రూరల్: పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్ పరీక్ష మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలో మూడు, కోస్గిలో రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 1386 మంది విద్యార్థులకుగాను 1303 మంది హాజరయ్యారు. మిగతా 79 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంలో 240కి 224మంది, సీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 511కి 486మంది, బ్రిలియంట్ స్కూల్‌లో 240కి 223మంది, కోస్గి ఇంజినీరింగ్ కళాశాలలో 240కి 228, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 151కి 142మంది హాజరయ్యారు. మొత్తం 94.2శాతం హాజరు శాతం నమోదైంది. ఉదయం 9 గంటల వరకే విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. 10 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రం లోపలికి అనుమతి ఇచ్చారు. నిమిషం నిబంధన ఉండటంతో పలువురు విద్యార్థులు చివరి నిమిషంలో ఉరుకులు, పరుగులు తీశారు. ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ చీఫ్ సూపరింటెండెంట్లుగా వ్యవహరించగా జిల్లా కో ఆర్టినేటర్‌గా శ్రీనివాసులు వ్యవహరించారు. ఇక సాంకేతిక విద్యామండలి నుంచి స్పెషల్ ఆఫీసర్, కోస్గి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల దగ్గర గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. రెవెన్యూ, వైద్య, పోలీసు అధికారులు నిరంతంర పర్యవేక్షించారు. పరీక్ష పూర్తయిన తరువాత బందోబస్తు మధ్య పరీక్ష పేపర్లును వాహనాలలో తరలించారు.
6 నిమిషాలు ఆలస్యం.. అనుమతి నిరాకరణ
ఇదిలాఉండగా, కోస్గి మండలంలోని హన్మన్‌పల్లి గ్రామానికి చెందిన స్వాతి ఉదయం 11.06 గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకోగా.. నిర్వాహకులు ఆమెను అనుమతించలేదు. సమయానికి బస్సు లేకపోవడంతో ఆటోలో రావాల్సి వచ్చిందని, ప్రయాణికులతో నిండిన తర్వాతే ఆటో కోస్గికి వచ్చిందని, దీంతో ఆలస్యమైందని సదరు విద్యార్థి ఆవేదన వ్యక్తం చేసింది. ఎంత బతిమిలాడినా అనుమతించలేదు. దీంతో గేటు వద్దే విద్యార్థి రోదిస్తూ ఉండగా.. పోలీసులు నచ్చజెప్పారు.
79 మంది విద్యార్థులు గైర్హాజరు