
రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి
కోస్గి: రైతులు వ్యవసాయంలో రసాయన ఎరువులు, ముఖ్యంగా యూరియా వినియోగాన్ని తగ్గించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు.మంగళవారం గుండుమాల్ రైతు వేదిక భవనంలో వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో భాగంగా పలువురు శాస్త్రవేత్తలు హాజరై రైతులకు అధునాతన వ్యవసాయంతో కలిగే ప్రయోజనాలను సమగ్రంగా వివరించారు. రైతులు మూస పద్ధతులను పాటించకుండా వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు సూచనలు తీసుకుంటూ అధునాతన వ్యవసాయ పద్ధతులు పాటించాలని సూచించారు. నూతన వంగడాలు, పచ్చిరొట్ట ఎరువుల వినియోగంతో భూసారం పెంపుదల వంటి అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. విధిగా పంట మార్పిడి విధానం అవలంభించి భూసారాన్ని పెంచుకోవచ్చని, ప్రభుత్వం రాయితీలు కల్పిస్తూ అందిస్తున్న పచ్చిరొట్ట విత్తనాలతో పంట పొలాల్ని సారవంతం చేసుకోవాలన్నారు.
విత్తన కొనుగోలులో జాగ్రత్త:
డీఏఓ జాన్ సుధాకర్
రానున్న వానాకాలం సీజన్ నేపథ్యంలో రైతులు విత్తనాల కొనుగోలు విషయంలో అప్రమత్తంగా ఉండాలని డీఏఓ జాన్ సుధాకర్ సూచించారు. రైతులు నకిలీ విత్తనాలపై జాగ్రత్తగా ఉండాలని, వ్యవసాయ శాఖ ధ్రువీకరించిన విత్తనాలను కొనుగోలు చేయడంతోపాటు విత్తనాలు వేసుకునే ముందు ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలని సూచించారు. జిల్లా పశువైద్యాధికారి ఈశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు వ్యవసాయంతోపాటు అనుబంధ రంగమైన పాడి పరిశ్రమపై దృష్టి సారించి అదనపు ఆదాయం పొందవచ్చునని సూచించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ పరిమళ్ కుమార్, డాక్టర్ జేడీ సరిత, ఉద్యావవన శాఖ అధికారి హర్షవర్దన్, ఏఓలు రేష్మారెడ్డి, రామకృష్ణ, లీడ్ బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.