
నారాయణపేట రూరల్: కర్ణాటక రాష్ట్రంలో జరగనున్న శాసనసభ ఎన్నికల దృష్ట్యా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సరిహద్దు చెక్‌పోస్టు ఎంతో కీలకమని, ఇరు రాష్ట్రాల పోలీసు అధికారులు అభిప్రాయపడ్డారు. శుక్రవారం పట్టణ శివారులోని ఎర్రగుట్ట చెక్‌పోస్టును ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు, కర్ణాటక రాష్ట్రం యాద్గీర్ ఎస్పీ వేదమూర్తి కలిసి పరిశీలించారు. ఇరు రాష్ట్రాల పోలీసులు కలిసి పనిచేసి అక్రమంగా తరలించే డబ్బు, మద్యం వంటి వాటిని అడ్డుకోవాలని, ఇతర విలాస వస్తువుల చేరివేతను కట్టడి చేయాలని నిర్ణయించారు.
బార్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక
కోస్గి: స్థానిక మున్సిఫ్ కోర్టు బార్ అసోసియేషన్ కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన కార్యవర్గంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి.ప్రభాకర్, ఉపాధ్యక్షుడిగా శకనప్ప, ప్రధాన కార్యదర్శిగా ఓంప్రకాష్, సహాయ కార్యదర్శిగా రాజలింగం, కోశాధికారిగా సంతోష్ నాయక్‌లను ఎన్నుకున్నారు. సీనియర్ న్యాయవాదులు ఏవీ ఆనంద్, కరుణాకర్ రెడ్డి, మురళి మోహన్, రామోజీ పాల్గొన్నారు.
రైతు సహకార సంఘం అభివృద్ధికి కృషి
కోస్గి: వ్యవసాయ సహకార సంఘాన్ని మరింత అభివృద్ధి చేసి రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని పీఏసీఎస్ చైర్మన్ భీంరెడ్డి సూచించారు. ఈ మేరకు శుక్రవారం పీఏసీఎస్ భవనంలో భీంరెడ్డి అధ్యక్షతన పీఏసీఎస్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అభివృద్ధి కోసం చేపడుతున్న పనులను చైర్మన్ వివరించారు. రైతుల అవసరాల కోసం 1000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన నూతన గోదాం నిర్మించామని, నూతన మండల కేంద్రం గుండుమాల్‌లో సొసైటీకి సంబంధించిన 17 గుంటల భూమిని సద్వినియోగం చేసుకునేందుకు తీర్మానించారు. రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో వడ్డీ చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంఘంలో సభ్యత్వం ఉండి ఓటు హక్కు కలిగిన రైతులు ఎవరైన మృతిచెందితే.. వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలన్నారు. ఎంపీపీ మధుకర్ రావు, వేణుగోపాల్, సొసైటీ డైరెక్టర్లు, అంజిలయ్య పాల్గొన్నారు.
కుట్ర పూరితంగానేఅనర్హత వేటు
నారాయణపేట టౌన్: దేశ ప్రధాని మోదీ చిరకాల మిత్రుడు ఆదాని కంపెనీలో రూ.వేల కోట్లు ఎలా వచ్చయో తెలపాలని పార్లమెంట్ సాక్షిగా రహుల్ గాంధీ ప్రశ్నించడంతోనే ప్రధాని మోదీ ప్రభుత్వం, కుట్ర పూరితంగానే రహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిందని డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి, మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాహుల్ గాంఽధీ లోక్‌సభలో ఆదానీ, ప్రధాని మోదీ మధ్య ఉన్న సంబంధాన్ని ప్రశ్నిస్తూ.. ప్రసంగించడంతోనే రాహుల్‌గాంధీపై మోదీ ప్రభుత్వం అనర్హత వేటు వేయడమే కాకుండా, ఇంటిని ఖాళీ చేయాలని నోటీసులు పంపడం మోదీ ప్రభుత్వం వికృత చేష్టలకు నిదర్శనమన్నారు. జోడో యాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకున్న రాహుల్ గాంధీకి ప్రజల్లో వచ్చిన ఆధరణను చూసి ఓర్వలేకనే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను విడనాడకుంటే ప్రజలతో కలిసి పెద్దఎత్తున ఉద్యమ కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. సుధాకర్, శివకుమార్, ఎండీ గౌస్, సదాశివరెడ్డి, బాల్‌రెడ్డి, ఎండి.సలీం పాల్గొన్నారు.
