
మన ఊరు మన బడితో నూతన హంగులతో రూపుదిద్దుకున్న రాయికోడ్ ప్రాథమిక పాఠశాల తరగతి గది
నర్వ: తెలంగాణ ప్రభుత్వం సర్కారు బడుల బాగుకోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు– మన బడి’ కార్యక్రమంతో పాఠశాలలు బాగుపడుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా కనీస మౌలిక వసతులు కరువై కూనరిల్లుతున్న పాఠశాలలకు ఈ పథకంతో నూతన జవసత్వాలను తీసుకొచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులైన తాగునీరు, మరుగుదొడ్లు, డైనింగ్‌హాల్ నిర్మాణం, అదనపు తరగతి గదులు, ప్రహరీల నిర్మాణాలు, పాఠశాలలకు కామన్ విధానంతో నూతన పేయింటింగ్, ప్రతి తరగతి కార్పొరేట్ పాఠశాలలను తలిపించేలా డిజిటలైజేషన్, విద్యార్థులు కూర్చునేందుకు డ్యుయల్ డెస్క్‌లను సరఫరా చేయడంతో కొత్త రూపును సంతరించుకున్నాయి. ఇటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సర్కారు బడుల బాగుకోసం తీసుకుంటున్న అనేక కార్యక్రమాలతో ఇటీవల ముందస్తుగానే విద్యార్థులకు యూనిఫాం అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే పాఠశాలల సమగ్ర స్వరూపాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేసేందుకు గతంలో ఉన్న యూడైస్, యూడైస్ ప్లస్ వంటి కార్యక్రమాలు చేపట్టింది. పాఠశాలల్లోని సమగ్ర సమాచారాన్ని నిక్షిప్తం చేసేందుకు ఉపాధ్యాయులు ఆన్‌లైన్ ద్వారా తమ ఫోన్లలో స్టోరేజీ చేసుకుని పంపించే వారు. ఈ క్రమంలో అధికారులకు అందించే సమాచార పంపిణీలో లోపాలు తలెత్తుతాయనే ఉద్దేశంతో ప్రభుత్వ ట్యాబ్‌ల పంపిణీకి శ్రీకారం చుట్టింది.
తీరనున్న ఇబ్బందులు..
ఆన్‌లైన్ ద్వారా పాఠశాలల వివరాలను పంపించేందుకు గతంలో ఎదురైన ఇబ్బందులను గుర్తించిన అధికారులు.. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ప్రభుత్వం దృష్టిసారించి పాఠశాలల సమాచారాన్ని ఇక నుంచి ఉపాధ్యాయులు ట్యాబ్‌ల ద్వారా పంపించాలని వారికి ట్యాబ్‌లను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ట్యాబ్‌లను విద్యార్థుల సంఖ్య ఆధారంగా పంపిణీ చేసేందుకు సిద్ధం చేసింది.
జిల్లాలో పంపిణీకి సిద్ధం..
జిల్లాలో మొత్తం 500 పాఠశాలలున్నాయి. ఇందులో 296 ప్రైమరీ, 85 అప్పర్ ప్రైమరీ పాఠశాలలకు గాను 381 పాఠశాలలకు 449 ట్యాబ్‌లు అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారుల కార్యాలయాలకు ప్రభుత్వం ట్యాబ్‌లను పంపిణీ చేసింది. ఇందులో స్టూడెంట్ చైల్డ్ ఇన్‌ఫో ప్రకారం 165 మంది విద్యార్థులు కంటే తక్కువగా ఉంటే ఒక్క ట్యాబ్, ఆపైన ఉండే విద్యార్థులు ఉన్న పాఠశాలలకు రెండు ట్యాబ్‌లు అందించాలని ఈ ప్రకారం ట్యాబ్‌లను జిల్లాలకు ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ ట్యాబ్‌ల వినియోగంపై ముందుగా జిల్లా విద్యాశాఖ అధికారులకు, ఆ తర్వాత పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. ఆ తర్వాతే ట్యాబ్‌లను ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు పంపిణీ చేయనున్నారు.
ట్యాబ్‌లో పంపించే సమాచారం..
స్యామ్‌సంగ్ ఏ8 రకం ట్యాబ్‌లను అందించనున్నారు. దీని సామర్థ్యం 4 జీబీ, 64 జీబీ, 7 వేల ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీతో కూడిన ట్యాబ్‌లు. ఇందులో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు చేపట్టిన తొలిమెట్టు కార్యక్రమం వివరాలను, మధ్యాహ్న భోజన పథకం వివరాలను, ‘మన ఊరు– మన బడి’ వివరాలను, చైల్డ్ ఇన్‌ఫో డాటా, ఉపాధ్యాయులు, విద్యార్థుల ఐఎస్‌ఎంఎస్ పోర్టల్, ఈ వివరాలన్ని ట్యాబ్‌లో నిక్షిప్తం చేసి అధికారులకు సమాచారం పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు.
