నారాయణపేట: ఏప్రిల్ 3 నుంచి ప్రారంభంకానున్న 10వ తరగతి పరీక్షలను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డికి వీడియో కాన్ఫరెన్స్‌లో వివరించారు. జిల్లాలో 38 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఆ కేంద్రాల్లో 7,616 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. సకాలంలో ప్రశ్నపత్రాలు కేంద్రాలకు చేరే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈసారి పదో తరగతి పరీక్షకు కేవలం ఆరు పేపర్లు ఉంటాయని, ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటాయన్నారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, విద్యార్థులు సకాలంలో చేరుకునే విధంగా రూట్ల వారీగా బస్సుల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా, పోలీస్ బందోబస్తుకు తగిన ఆదేశాలు జారీ చేసినట్లు తెలియజేశారు. కేంద్రాల్లో తాగునీరు, ఫస్ట్‌ఎయిడ్ కిట్స్, మరుగుదొడ్లు, అవసరమైన మేరకు ఫర్నిచర్ వంటివి ఏర్పాటు చేశామని అన్నారు. ఇప్పటికై నా లైన్ డిపార్ట్‌మెంట్‌లతో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. విద్యార్థులు ఉదయం 9గంటల వరకు పరీక్ష కేంద్రానికి చేరుకునే విధంగా చూసుకోవాలని తెలియజేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు, డీఈఓ లియాకత్ అలీ, డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాంమనోహర్‌రావు, డీటీ ఓ యాదగిరి, ఆర్టీఓ రామస్వామి, కలెక్టరేట్ సూప రింటెండెంట్ జగదీశ్వర్, సీఐ రాంలాల్, ఆర్టీసీ, పోస్టల్, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.