
సామాజిక తనిఖీలో పాల్గొన్న పీడీ గోపాల్‌నాయక్
నారాయణపేట రూరల్: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా 2018–19 నుంచి 2020–21 వరకు మూడు ఆర్థిక సంవత్సరాల్లో జరిగిన పనులకు సంబంధించి, వారం రోజులుగా గ్రామాల్లో ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయి తనిఖీలు చేశాయి. ఈ క్రమంలో వారు సేకరించిన వివరాలతో బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సామాజిక తనిఖీ– బహిరంగ సభ నిర్వహించారు. దీనికి పీడీ గోపాల్‌నాయక్ హాజరయ్యారు. అంబుడ్స్‌మెన్ నాగిరెడ్డి, అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో పరిశీలన చేపట్టారు. గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా మండలంలోని 28 జీపీల్లో మొత్తం రూ.16.69కోట్ల పనులు చేపట్టగా వాటిలో మొక్కలు నాటడం, వాటిని పెంచడంలో రైతులు, పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల రికార్డులు లేకపోవడంపై నోటీసుల జారీకి ఆదేశించారు. దాదాపు రూ.7.70కోట్లకు సంబందించి మొక్కలు రీప్లేస్ చేయాలని సూచించారు. అదేవిధంగా టీఏల పొరపాట్లకు సంబందించి రూ.3వేలు ఉంది. ఇక పనుల విషయంలో జరిగిన తప్పులకు సంబందించి రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శుల తదితర వారి నుంచి రూ.44,454 లు రికవరీకి ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ రాజు, ఏపీఓ జయమ్మ, సూపరింటెండెంట్ శోభారాణి, ఎఫ్‌ఏ, టీఏలు పాల్గొన్నారు.