
మాట్లాడుతున్న కలెక్టర్ శ్రీహర్ష
నారాయణపేట రూరల్: స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి బ్యాంకర్లు కృషి చేయాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం బ్యాంకర్ల జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందేందుకు అర్హులైన దరఖాస్తుదారులకు తోడ్పాటును అందించి రుణాలు అందించాలని చెప్పారు. పీఎం మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు జిల్లా గ్రామీణ శాఖ ద్వారా 275 దరఖాస్తులకు కేవలం 34మాత్రమే గ్రౌండింగ్ కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో లక్ష్యాన్ని చేధించాలన్నారు. నూతన మండలాల్లో బ్యాంకులు ఏర్పాటు చేయాలని, మద్దూర్, కోస్గి, నారాయణపేట, మరికల్‌లో ఏటీఎంలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీడీఎం షణ్ముఖచారి, ఎల్‌టీఓ తేజ, లీడ్ బ్యాంక్ మేనేజర్ పాల్గొన్నారు. అలాగే జిల్లాలోని మున్సిపాలిటీల్లో పేరుకుపోయిన ఇంటి పన్ను త్వరగా వసూలు చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని మక్తల్, నారాయణపేట, కోస్గి మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని, డంపింగ్‌యార్డుల్లో సీసీరోడ్డు, వైకుంఠధామం పనులు పూర్తి చేయాలని సూచించారు.
ఈవీఎం, వీవీప్యాట్‌ల భద్రత పరిశీలన..
జిల్లా కేంద్రంలో భద్రపర్చిన ఈవీఎం, వీవీ ప్యాట్‌ల రక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం గోదాంను పరిశీలించారు. ఇటీవల ఈసీఐఎల్ నుంచి జిల్లాకు వచ్చిన 840 మిషన్లను వివిద పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి సరిచూశారు. ఆర్డీఓ రాంచందర్, జగదీశ్వర్, దానయ్య, సాయినాథ్, నాయకులు పాల్గొన్నారు.