‘పది’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

‘పది’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

Mar 29 2023 1:14 AM | Updated on Mar 29 2023 1:14 AM

- - Sakshi

నారాయణపేట రూరల్‌: వచ్చే నెల 3వ తేదీ నుంచి నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు జిల్లాలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాల ఎంపిక, అవసరమైన సౌకర్యాలు, పరీక్ష పత్రాలు చేర్చడం తదితర అంశాలపై డీఈఓ లియాకత్‌అలీ ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు..

ప్రశ్న: జిల్లాలో ఎన్ని ఉన్నత పాఠశాలలు ఉన్నాయి? ఎంతమంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు?

జవాబు: జిల్లా వ్యాప్తంగా 6 ప్రభుత్వ, 70 లోకల్‌బాడీ, మూడు ఎయిడెడ్‌, 35 ప్రైవేటు, 11 కేజీబీవీ, మూడు జ్యోతిరావు పూలే, రెండు మాడల్‌ స్కూళ్లు, రెండు మైనార్టీ, ఆరు సోషల్‌ వెల్ఫేర్‌, ఒక ట్రైబల్‌ వెల్ఫేర్‌ పాఠశాలలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 7,564 రెగ్యులర్‌ విద్యార్థులలో 3,583 బాలురు, 3,981 బాలికలు, 47మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు.

ప్రశ్న: పరీక్షల నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?

జవాబు: పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతీ సెంటర్‌లో రెండు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఒక ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం ఆకస్మిక తనిఖీలు చేస్తుండగా, మరో ఏడు సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలు ఏర్పాటు చేశాము. వీరు పరీక్ష ప్రారంభం నుంచి చివరివరకు కేంద్రంలోనే ఉండి పర్యవేక్షిస్తారు. పరీక్షల సమయంలో జిరాక్స్‌ కేంద్రాలను మూసివేసే విధంగా చర్యలు చేపడుతున్నాం. ప్రతీ కేంద్రానికి తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయిస్తున్నాం.

ప్రశ్న: పరీక్షల నిర్వహణపై శిక్షణ ఇచ్చారా?

జవాబు: పరీక్షల నిర్వహణ కోసం ఇప్పటికే చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌ అధికారులను సెంటర్ల వారీగా నియమించి సమావేశాలు నిర్వహించాం. ప్రత్యేక్ష శిక్షణతో పాటు వారి సందేహాలను నివృత్తి చేస్తున్నాం. నిబంధనలకు సంబందించిన బుక్‌లెట్‌ పంపిణీ చేశాం. ఇన్విజిలేటర్ల నియామకం జరుగుతుంది. వారికి తగిన సూచనలు చేస్తున్నాం.

ప్రశ్న: పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించారు?

జవాబు: కలెక్టర్‌ చొరవతో అన్ని శాఖలను సమన్వయం చేసి అవసరమైన చర్యలు చేపట్టాం. పరీక్ష కేంద్రాలుగా గుర్తించిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో వెలుతురు, గాలి వచ్చేలా ఏర్పాటు చేశాం. మూత్రశాలలు, మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్‌ సరఫరా, ఫ్యాన్లు ఉంటేలా మార్పులు చేశాం. వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచి ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందిస్తాం. శాంతిభద్రతల విషయంలో పోలీసుల సహకారంతో 144 సెక్షన్‌ అమలు చేయిస్తాం. సమయానికి విద్యార్థులు చేరుకునే విధంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయిస్తున్నాం.

ప్రశ్న: విద్యార్థుల సౌకర్యార్థం టోల్‌ ఫ్రీ నంబర్‌ ఉందా?

జవాబు: విద్యార్థుల సందేహాల నివృత్తికి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తున్నాం. పరీక్షలకు సంబందించి ఏమైనా ఇబ్బందులు, ఫిర్యాదులు, సలహాలు తెలియజేయాలనుకుంటే సెల్‌ నంబర్‌ 94402 32039కు సమాచారం ఇవ్వడానికి అందుబాటులో ఉంచాము.

ప్రశ్న: పరీక్షలకు విద్యార్థులను ఎలా సిద్ధం చేశారు?

జవాబు: ఈ పరీక్షల నిర్వహణ ప్రతీ టీచర్‌కు సవాల్‌గా మారింది. పరీక్షల్లో మంచి మార్కుల సాధనకు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అభ్యాస దీపికలు అందించాము. రెండుసార్లు ప్రి ఫైనల్‌ పరీక్షలను నిర్వహించి పరీక్షల మాడల్‌ తెలియజేశాం. వందశాతం ఉత్తీర్ణతతో పాటు ఎక్కువ సంఖ్యలో 10జీపీఏ సాధనకు కృషి చేస్తున్నాం.

ప్రశ్న: హాల్‌టికెట్ల విషయంలో ఇబ్బందులు ఎలా అధిగమించాలి?

జవాబు: హాల్‌టికెట్లు పాఠశాలలకు పంపడంతో పాటు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో నేరుగా హాల్‌టికెట్లను విద్యార్థులకు అందిస్తారు. ఇక ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజుల పేరుతో హాల్‌టికెట్లు ఆపినట్లు ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు సైతం ‘బీఎస్‌ఈ.తెలంగాణ.జీఓవీ.ఇన్‌’ అనే వెబ్‌సైట్‌ ద్వారా తమ హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. హెచ్‌ఎం సంతకం లేకుండానే పరీక్షకు నేరుగా హాజరుకావచ్చు.

డీఈఓ లియాకత్‌ అలీ

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement