బీఆర్‌ఎస్‌కు ఇటీవల రాజీనామా చేసిన అసంతృప్తి నేతలందరూ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నిరంజన్‌రెడ్డి గెలుపు కోసం కీలకంగా పనిచేశారు. వీరందరూ దూరమైన పక్షంలో వచ్చే ఎన్నికల్లో ప్రభావం పడే అవకాశం ఉందని.. ప్రస్తుత పరిణామాలు పార్టీకి, మంత్రికి చేటు చేసేలా ఉన్నాయని శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. దీంతో కలవరపాటుకు గురైన మంత్రి.. రాజీనామా చేసిన నేతలకు ఉన్న ప్రజాబలాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేసేందుకు రహస్య సర్వేకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. బీఆర్‌ఎస్ పార్టీ, మంత్రిపై ప్రజల నాడీ సైతం తెలుసుకోవాలని సర్వే బృందాలకు ఆయన సూచించినట్లు తెలిసింది. వనపర్తి మున్సిపాలిటీలోని 33 వార్డుల్లో ఇతర ప్రాంతాలకు చెందిన యువకులు, పెద్దమందడి మండలంలో పోలీస్ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సర్వే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
విలక్షణ తీర్పునకు వనపర్తి నియోజకవర్గం పెట్టింది పేరు. ఇప్పటివరకు కాంగ్రెస్ నుంచి డాక్టర్ చిన్నారెడ్డి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్‌గా కొనసాగుతున్నారు. బీఆర్‌ఎస్ నుంచి 2018 ఎన్నికల్లో గెలిచిన నిరంజన్‌రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉండడంతో 2014 ఎన్నికల్లో ఓటమిపాలైనా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించి ప్రాధాన్యం కల్పించారు. టీడీపీ నుంచి రావుల చంద్రశేఖర్‌రెడ్డి రెండుసార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. చీఫ్‌విప్‌గా విధులు నిర్వర్తించారు. ఏడు మండలాలు ఉన్న ఈ సెగ్మెంట్‌లో అనతికాలంలోనే భారత్ రాష్ట్ర సమితి తిరుగులేని శక్తిగా అవతరించింది. అయితే ఇటీవల జెడ్పీ చైర్మన్ ఆర్.లోక్‌నాథ్‌రెడ్డి, పెద్దమందడి, వనపర్తి ఎంపీపీలు మేఘారెడ్డి, కిచ్చారెడ్డి, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు ఐ.సత్యారెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ సాయిచరణ్‌రెడ్డితోపాటు మరికొంత మంది ప్రజాప్రతినిధులు పార్టీకి రాజీనామాలు చేశారు. మంత్రి ఏకపక్ష నిర్ణయాలు, ఒంటెద్దు పోకడలు, వేధింపులు తమను ఆవేదనకు గురిచేశాయని.. వచ్చే ఎన్నికల్లో ఆయన ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని.. అందరితో చర్చించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని మీడియా సమక్షంలో వెల్లడించారు. వీరి రాజీనామా మంత్రి నిరంజన్‌రెడ్డితోపాటు పార్టీ శ్రేణులనుషాక్‌కు గురి చేసింది.
రాజీనామా చేసిన నేతల
మండలాల్లోనే..
వచ్చే నెల 25వ తేదీలోగా ఆయా నియోజక వర్గాల పరిధిలో అన్ని మండలాల్లో ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో వనపర్తి జిల్లాలో బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు జోరుగా సాగుతున్నాయి. పోయిన దగ్గరే వెతుక్కోవాలనే లక్ష్యంతో రాజీనామా చేసిన ఎంపీపీ మేఘారెడ్డి సొంత మండలమైన పెద్దమందడిలో ముందుగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. భారీగా జనసమీకరణ చేసి సత్తాచాటారు. కాగా, భవిష్యత్‌లో మరింత మంది అసంతృప్త్త నేతలు బీఆర్‌ఎస్‌ను వీడుతారనే ప్రచారం జోరుగా సాగుతుండగా.. ఎవరేం చేసినా గెలుపు బీఆర్‌ఎస్‌దేనని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.