అవుకులో అడుగంటిన జలాలు | - | Sakshi
Sakshi News home page

అవుకులో అడుగంటిన జలాలు

Jun 21 2026 6:46 AM | Updated on Jun 21 2026 6:46 AM

ఇంకా నిర్ణయం తీసుకోలేదు

ఆయకట్టు రైతుల్లో ఆందోళన

కొలిమిగుండ్ల(అవుకు): అవుకు రిజర్వాయర్‌ పదేళ్ల తర్వాత డెడ్‌ స్టోరేజ్‌కు చేరుకుంది. సాధారణ నీటి మట్టం 4.148 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.79 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. దశాబ్దం తర్వాత ఈ పరిస్థితి తలెత్తడంతో రైతులు, ప్రజల్లో అందోళన నెలకొంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదముందని భావిస్తున్నారు. ఇప్పటికే రిజర్వాయర్‌ జలకళతో సంతరించుకోవాల్సి ఉంది. రిజర్వాయర్‌కు చెందిన రివిట్‌మెంట్‌ రెండు సార్లు కుంగిపోవడంతో అధికారులు గాలేరు–నగరి వరద కాల్వ ద్వారా వైఎస్సార్‌ జిల్లాకు నీటిని వదిలారు. కట్టకు ప్రమాదం ఉన్న నేపథ్యంలో రిజర్వాయర్‌లో రెండు టీఎంసీలు మాత్రమే నిల్వ చేశారు. లీకేజీని అరికట్టేందుకు రూ.45 లక్షలు ఖర్చు వెచ్చించి కర్ణాటక నుంచి నిపుణుల బృందాన్ని రప్పించారు. దాదాపు నెల రోజుల పాటు ప్రయత్నం చేసినా చివరకు 30 శాతం మాత్రమే లీకేజీని అరికట్టగలిగారు. ఇప్పుడు ఎగువ నుంచి నీళ్లు వచ్చినా పూర్తిస్థాయిలో నీటిని నింపుతారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

రైతుల్లో కలవరం

రిజర్వాయర్‌లోకి ఆశించిన స్థాయిలో నీరు రాకపోతే ఆయకట్టు రైతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే 50 గ్రామాలకు పైగానే తాగునీరు అందుతుందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శ్రీశైలంలో పూర్తిస్థాయి నీటి మట్టం ఉంటే అక్కడి నుంచి ఎస్సార్బీసీ ద్వారా అవుకు రిజర్వాయర్‌లోకి వదులుతారు. రిజర్వాయర్‌ డెడ్‌ స్టోరేజ్‌కు చేరుకోవడంతో వరి పండించే రైతుల్లో కలవరం మొదలైంది. స్థానికంగా ఈ రిజర్వాయర్‌ కింద మూడు వేల ఎకరాల్లో వరి సాగవుతోంది. రిజర్వాయర్‌లో నీటి నిల్వలు లేనందున ఎస్సార్బీసీ రైతుల పరిస్థితి దారుణంగా ఉంది.

రిజర్వాయర్‌లో నీటిమట్టం తక్కువ ఉన్నందున లోకల్‌ ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. శ్రీశైలానికి కొంతమేర ఇన్‌ఫ్లో వస్తోంది. త్వరలోనే ఐఏబీ సమావేశం జరుగుతుంది. అందులో నిర్ణయం తీసుకుంటారు. నీటిమట్టం తక్కువగా ఉన్నందున రైతులు తొందరపడొద్దు.

– శుభకుమార్‌, ఎస్సార్బీసీ ఈఈ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement