కర్నూలు సిటీ: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లోని (కేజీబీవీ) కాంట్రాక్ట్ టీచర్ల బదిలీల్లో నెలకొన్న గందరగోళంతో అందరూ అయోమయంలో పడ్డారు. జిల్లాలో 26 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో స్పెషల్ ఆషీసర్లుగా, పీఈటీ, సీఆర్‌టీలుగా సుమారుగా 315 మంది పని చేస్తున్నారు. ఇందులో 250 మంది వరకు కచ్చితంగా బదిలీ కావల్సిన వారు ఉన్నారు. వారిలో 202 మంది, రిక్వెస్ట్ బదిలీకి 84 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి 275 ఖాళీలు బదిలీలకి గత నెల డిస్‌ప్లే చేసి మౌఖికంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండానే బదిలీలు చేసి, బదిలీ అయిన వారిని కొత్త స్థానాల్లో చేరాలని కూడా సూచించారు. ఈ మేరకు చాలా మంది బదిలీ అయిన స్థానాల్లో చేరారు. అయితే జిల్లాలో సుమారుగా 46 మంది బదిలీలపై న్యాయస్థానాల్లో కేసులు వేసి వారిని యథాస్థానాల్లోనే కొనసాగేటట్లు ఉత్తర్వులు తెచ్చుకున్నారు. వీరందరూ తిరిగి వారి స్థానాల్లోకి రావడంతో వారి స్థానాల్లో చేరిన వారు సైతం తిరిగి వాళ్ల స్థానాల్లో వెళ్లాలా? లేకపోతే తదుపరి ఉత్తర్వులు ఇస్తారా? అనే విషయం తెలియక చిరుద్యోగులు మానసిన ఒత్తిడికి గురవుతున్నారు. కొంత మంది కేజీబీవీ కార్యదర్శికి పోన్లు చేసి తమ ఆవేదన చెప్పుకుంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. కర్నూలు నగరానికి సమీపంలో ఉండే ఇద్దరు, ముగ్గురు కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లుగా చాలా ఏళ్లుగా పని చేస్తున్నారు. బదిలీల ప్రస్తావన వచ్చి ప్రతిసారి తమ ఆర్థిక బలంతో కేసులు వేయించి బదిలీలను నిలిపి వేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. 15 ఏళ్లకుపైగా చాలా మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ టీచర్లు కుటుంబాలకు సూదురంగా పని చేయాల్సి వస్తుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూన్నారు. గత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వేసిన ఓ కేసు విషయంలో హైకోర్టు మినిమం టైం స్కేల్‌తో పాటు మరికొన్ని సదుపాయాలను కల్పించాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ఉద్యోగులుగా పని చేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎంటీఎస్ అమలుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంపై సమస్యలను నాన్చుతుందనే విమర్శలు ఉన్నాయి.
విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గత నెలలో కేజీబీవీల్లో పని చేసే టీచర్లకు బదిలీలను పారదర్శకంగా నిర్వహించాం. చాలా మంది ఏళ్లుగా దూరం ఉన్న వారికి కూడా వారు అనుకున్న స్థానాలు రావడంతో చాలా సంతోష పడుతున్నారు. అయితే కొంత మంది కోర్టుకెళ్లడంతో వారిని కోర్టు ఆదేశాల మేరకు వారి స్థానాల్లోనే కొనసాగించి, అక్కడికి వచ్చిన వారిని సీనియారిటీ ఆధారంగా ఖాళీలను దృష్టిలో పెట్టుకొని స్థానాలను కేటాయించేందుకు చర్యలు తీసుకుంటాం. వారంలోగా కచ్చితంగా బదిలీలపై స్పష్టత రానుంది. – డా.ఎన్‌బీ లోకరాజు,
సమగ్ర శిక్ష అదనపు కో–ఆర్డినేటర్
గత నెలలో కేజీబీవీ టీచర్ల
బదిలీలకు కౌన్సెలింగ్
బదిలీలను అడ్డుకునేందుకు
న్యాయస్థానాల్లో 46 మంది కేసులు
వారి స్థానాల్లోనే కొనసాగేలా
తాత్కాలిక ఉత్తర్వులు
అప్పటికే కొత్త స్థానాల్లో
విధుల్లో చేరిన ఉద్యోగులు
ఎక్కడ పని చేయాలా
అర్థంకాక ఆందోళన


