ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పురపాలక సంఘం మాజీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ రామలింగారెడ్డి (87) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామలింగారెడ్డి శనివారం మధ్యా హ్నం తన నివాస గృహంలో ఉన్నట్టుండి కుప్ప కూలి పోయి మృతి చెందారు. సుదీర్ఘకాలం ఆళ్లగడ్డలో ఆసుపత్రి ఏర్పాటు చేసి డాక్టర్‌గా సేవలందించడంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మున్సిపల్ వైస్ చైర్మన్‌గా, చైర్మన్‌గా ఎన్నికై ఆళ్లగడ్డ పట్టణంతో పాటు నియోజకవర్గ ప్రజల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. రామలింగారెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంట్ పరిశీలకులు గంగుల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డిలతో పా టు పలువురు వైఎస్సార్‌సీపీ శ్రేణులు సంతాపం వ్యక్తం చేశారు.
మద్దిలేటయ్య కిటకిట
బేతంచెర్ల: వైష్ణవ పుణ్య క్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయం శనివారం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. జ్యేష్ట మాసం శుభ దినాల నేపథ్యంలో జిల్లా నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచే ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు చర్యలు చేపట్టారు.
యూనిఫైడ్ సర్వేపై
అభ్యంతరాలను తెలపండి
కర్నూలు(అర్బన్): యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే డేటాలో కుటుంబ వివరాలకు సంబంధించి ఏవైనా తప్పులు, పొరపాట్లు, అభ్యంతరాలు ఉంటే ఈ నెల 24లోగా ఫిర్యాదు చేసుకోవచ్చని జిల్లా స్వర్ణ గ్రామ/స్వర్ణ వార్డు సచివాలయాల అధికారి టీవీ భాస్కర్‌నాయుడు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అభ్యంతరాలను ఆయా సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లు, వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రెటరీల ద్వారా పోర్టల్‌లో నమోదు చేయవచ్చన్నారు. కులంతో సంబంధం లేని ఫిర్యాదులను ఈ నెల 26వ తేది నాటికి, కులంతో సంబంధం ఉన్న ఫిర్యాదులను ఈ నెల 27వ తేది నాటికి సరిచేసి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే డేటాను వ్యాలిడేషన్ చేస్తామన్నారు.
కర్నూలు(అగ్రికల్చర్): ఈ ఏడాది ఉల్లి సాగు చేసే రైతులకు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన(ఆర్‌కేవీవై) కింద నాణ్యమైన విత్తనాల కోనుగోలుపై 50 శాతం సబ్సిడీ లేదా హెక్టారుకు గరిష్టంగా రూ.3వేలు (ఏదీ తక్కువైతే అది) అందివ్వనున్నట్లు జిల్లా ఉద్యాన అధికారి రాజాకృష్ణారెడ్డి తెలిపారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులోని జాతీయ ఉద్యాన పరిశోధన, అభివృద్ధి సంస్థ(ఎన్‌హెచ్‌ఆర్‌డీఎఫ్) అగ్రిఫౌండ్ డార్క్‌రెడ్ ట్రూత్ ఫుల్లీ లేబుల్డ్(టీఎస్) కిలో విత్తనాలు రూ.1,600, సర్టిఫైడ్ లేదా ఫౌండేషన్ విత్తనాలు కిలో రూ.1800 ప్రకారం సరఫరా చేస్తోందన్నారు. కే.883 ట్రూత్ ఫుల్లీ లేబుల్డ్(టీఎస్)విత్తనాలు కిలో రూ.1800లకు పంపిణీ చేస్తోందన్నారు. ఎన్‌హెచ్‌ఆర్‌డీఎఫ్ విత్తనాలే కాకుండా ఇతర ఏ ప్రయివేటు విత్తనాలు కొనుగోలు చేసినా సబ్సిడీ వర్తిస్తుందన్నారు. రైతులు విత్తనాల కొనుగోలుకు సంబంధించి దరఖాస్తుతో పాటు బిల్లులు, పట్టాదారు పాసు పుస్తకాల ప్రతులను రైతు సేవా కేంద్రాల్లో సమర్పించాలని ఆయన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


