● ఎమ్మిగనూరులో రెండు కోర్టులు
● జూలై నెలాఖరులోపు ప్రారంభం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి
ఎమ్మిగనూరురూరల్: అదనపు కోర్టుల ఏర్పాటుతో పెండింగ్‌లో ఉన్న చాలా కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి పేర్కొన్నారు. పట్టణంలోని పాత తహసీల్దార్ కార్యాలయ భవనం, కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ కార్యాలయాన్ని ఆయనతోపాటు జిడ్జి పి.హేమ, మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు, ఆర్‌అండ్‌బీ డీఈ నాగరాజు, బార్ అసోషియేషన్ సభ్యులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి జి.కబర్ధి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అదనపు కోర్టులు ఏర్పాటుకు రూ. 96 కోట్లు కేటాయిస్తే కర్నూలు జిల్లాకు రూ. 21 కోట్లు వచ్చాయన్నారు. ఎమ్మిగనూరుకు ఉన్న కోర్టుతో పాటు అదనపు కోర్టు, మెజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటుకు రూ. 2 కోట్లు కేటాయించిందని తెలిపారు. ప్రస్తుతానికి పాత తహసీల్దార్ కార్యాలయంలో ఒక కోర్టు, కోర్టు అవరణలో ఉన్న బార్ అసోసియేషన్ కార్యాలయంలో మరో కోర్టు ఏర్పాటుకు నిర్ణయించినట్లు చెప్పారు. బార్ అసోసియేషన్ సభ్యులు తమ భవాన్ని అదనపు కోర్టుకు ఇచ్చి తాము షెడ్స్‌లో ఉంటామని చెప్పటం చాలా సంతోషంగా ఉందన్నారు. రెండు కొత్త కోర్టులను జూలై నెలాఖరు లోపు ప్రారంభించనున్నట్లు, అంతలోపే సంబందిత అఽధికారులు మరమ్మతులు చేయించి సిద్ధం చేయాలన్నారు. ఎమ్మిగనూరు కోర్టులో ఇప్పటి వరకు 5 వేల కేసు పెండింగ్‌లో ఉన్నాయని, ఇప్పుడు కొత్త కోర్టుల ఏర్పాటు చేస్తే వాటికి త్వరితగిగతి పరిష్కారం లభిస్తుందన్నారు. కక్షిదారులు తమ కేసుల అప్పీల్‌కు ఆదోని కోర్టుకు వెళ్లేవారని ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయబోయే అదనపు కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చునని తెలిపారు. గోనెగండ్ల మండలానికి సంబంధించిన కేసులు పత్తికొండ కోర్టుకు వెళ్లేవని, ఇక నుంచి ఎమ్మిగనూరు కోర్టుకు మార్పు చేసినట్లు చెప్పారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. రషీదుల్లా, జనరల్ సెక్రటరీ కె.మల్లికార్జున, సీనియర్ న్యాయవాదులు పరమేశప్ప, లక్ష్మినారాయణరెడ్డి, డి. మల్లికార్జున, బార్ అసోసియేసన్ సభ్యులు పాల్గొన్నారు.


