జనాభా గణన దేశాభివృద్ధికి కీలకం
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: జనాభా గణన దేశాభివృద్ధికి కీలకమని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని అయ్యలూరు మెట్టలో ఉన్న ఎస్‌వీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన జనగణన శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడానికి, కుటుంబాల జీవన ప్రమాణా లను మెరుగుపరచడానికి, ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి జనాభా గణన ఎంతో అవసరమన్నారు. జిల్లాలో సుమారు 6 లక్షల కుటుంబాలు, 20 లక్షల జనాభా ఉన్నట్లు అంచనా ఉందన్నారు. జనగణనలో వయస్సు ఆధారంగా జనాభా విభజన, యువత సంఖ్య వంటి ముఖ్యమైన వివరాలు సేకరిస్తామన్నారు. ముందుగా హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ నిర్వహించి, ప్రతి గృహానికి ప్రత్యేక సెన్సస్ హౌస్ నంబర్లు కేటాయిస్తారని చెప్పారు. జనగణన కోసం మొత్తం ప్రాంతాన్ని బ్లాకులుగా విభజిస్తారని, ప్రతి బ్లాక్‌లో సుమారు 200 ఇళ్లు, 700 నుంచి 800 మంది జనాభా ఉండేలా ప్రణాళిక రూపొందిస్తారన్నారు. మొదటిసారిగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ప్రజలు ఆన్‌లైన్ ద్వారా ఎక్కడి నుంచైనా తమ గృహ వివరాలను జియో ట్యాగ్ చేసి నమోదు చేయవచ్చని, అనంతరం ఫీల్డ్ అధికారులు వాటిని ధ్రువీకరిస్తారని వివరించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ రాము నాయక్, మాస్టర్ ట్రైనర్లు విష్ణు, మాధురి, ఎల్లన్న తదితరులు పాల్గొన్నారు.


