నంద్యాల: జిల్లాలో గృహ అవసరాలకు సంబంధించి గ్యాస్ ఏజెన్సీ వారు వంట గ్యాస్ కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ కే. కార్తీక్ హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో గ్యాస్ వినియోగదారులు సంయమనం పాటించాలన్నారు. ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద తగినంత గ్యాస్ నిల్వలు ఉన్నాయని, ఆందోళనకు గురికావలసిన అవసరం లేదన్నారు. వచ్చే రోజుల్లో గ్యాస్ కొరత ఏర్పడుతుందనే అపోహతో గ్యాస్ వినియోగదారులు అధికంగా అదనపు బుకింగ్ చేయడం వలన సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. ఏజెన్సీ నిర్వాహకులు ఎటువంటి అనుమతులు లేకుండా గ్యాస్ సిలిండర్లను నిల్వ చేసినా, బ్లాక్ మార్కెట్‌కు తరలించినా తగిన చర్య తీసుకుంటామన్నారు. ఆస్పత్రులు పాఠశాలలు. హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలకు ఆటంకం లేకుండా గ్యాస్ ఇవ్వడంపై ప్రత్యేక దృష్టి సారించాలని గ్యాస్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవరైనా డెలివరీ బాయ్స్ వినియోగదారులతో అమర్యాదగా ప్రవర్తించినా లేదా బిల్లులో పేర్కొన్న మొత్తానికి మించి డబ్బులు డిమాండ్ చేసినా వెంటనే సంబంధిత పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దారు, సంబంధిత మండల తహసీల్దారు, జిల్లా పౌరసరఫరాల అధికారి లేదా టోల్ ఫ్రీ నంబర్ 1967, కమాండ్ కంట్రోల్ నంబర్ 08514–293903కు ఫిర్యాదు చేయాలన్నారు.


