ఎమ్మిగనూరుటౌన్: అధికారపార్టీ నాయకుల తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీని ఆప్కోలో విలీనం చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఇది సరికాదని వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్‌రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి నివాసంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్లు బుట్టారంగయ్య, డాక్టర్ కేఎస్ రఘు,పార్టీ చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి మాచాని వెంకటేష్ తదితరులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. పద్మశ్రీ మాచాని సోమప్ప ఆశయాలకు తూట్లు పొడిచి సొసైటీని నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయని వీటిని వెంటనే విరమించుకోవాలని కోరారు. చేనేతలపై ప్రేమ ఉంటే వైడబ్ల్యూసీఎస్‌ను అభివృద్ధి చేయా లే కాని నష్టాల ఊబిలో ఉన్న ఆప్కోలో విలీనం చేయరాదన్నారు. అధికారపార్టీ నాయకులు సొసైటీకి సంబంధించిన విలువైన అస్తులను కొల్లగొట్టేందుకే విలీన కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. చేనేత కార్మికుల శ్రేయస్సు కోసం పద్మశ్రీ మాచాని సోమప్ప స్థాపించిన వైడబ్ల్యూసీఎస్‌ను కాపాడుకునేందుకు తమ పార్టీ అవసరమైతే పోరాటం చేస్తుందన్నారు. సమావేశంలో చేనేత కార్మిక సంఘ నాయకులు రాము, నాగేంద్ర, గోవిందు తదితరులు పాల్గొన్నారు.


