ఎమ్మిగనూరురూరల్: బ్యాంకుల దగ్గర చోరీలకు పాల్పడే అంతర్రాష్ట్ర దొంగలను ఎమ్మిగనూరు పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ వి. శ్రీనివాసులు ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ నెల 16వ తేదీన ప్రమీల అనే మహిళ కెనరా బ్యాంక్‌లో తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు విడిపించుకొని స్కూటీలో పెట్టుకుంది. కొద్దిసేపటికే ఆమె కళ్లుగప్పి గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించుకెళ్లారు. తర్వాత చోరీ విషయం తెలుసుకున్న బాధితురాలు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ ముర్రవాడ భార్గవి పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టారు. దొంగతనం జరిగిన ప్రాంతంలో సీసీ పుటేజ్‌లను సేకరించి, సాంకేతిక పరిజ్ఞానంతో పరిశీలించి దొంగలు కర్ణాటక రాష్ట్రం భద్రావతి ప్రాంతానికి చెందిన శంకర్ బోవి, కార్తీ బోవిగా గుర్తించారు. ఆదివారం మంత్రాలయం రోడ్డులోని అనంతపద్మనాభస్వామి దేవాలయం దగ్గర వారిని అదుపులోకి తీసుకొని 13 గ్రాముల బంగారు చైన్, 17 గ్రాముల బంగారు నెక్లెస్, చోరీలకు ఉపయోగించే బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగలు నకిలీ ఐడీ కార్డులు పెట్టుకొని ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో చోరీకి పాల్పడినట్లు విచారణలో తేలిందని సీఐ వెల్లడించారు.


