 
															తిరుపతి బస్సుకు తప్పిన ప్రమాదం
ఉయ్యాలవాడ: సర్వాయిపల్లె సమీపంలో మంగళవారం రాత్రి ఓ ఆర్టీసీ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. కోవెలకుంట్లకు చెందిన ఆర్టీసీ బస్సు ఉయ్యాలవాడ మీదుగా ప్రతి రోజు తిరుపతికి నడుస్తోంది. తిరుపతి నుంచి బయలుదేరిన బస్సు మంగళవారం రాత్రి 8 గంటలకు ఆళ్లగడ్డకు చేరుకోగా ఉయ్యాలవాడ మీదుగా డిపోకు రావాల్సి ఉంది. భారీ వర్షాల కారణంగా ఇంజేడు సమీపంలోని కుందరవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండంతో బస్సు డ్రైవర్ దస్తగిరి, కండెక్టర్ సూరిబాబు.. సర్వాయిపల్లె మీదుగా బస్సును మళ్లించారు. గ్రామ సమీపంలో సైతం చిన్నపాటి వంకకు వర్షపునీరు పోటెత్తింది. వంకను దాటించే క్రమంలో బస్సు అదుపు తప్పి సైడులో ఇరుక్కపోయింది. ప్రమాదాన్ని గమనించిన బస్సులోని 15 మంది ప్రయాణికులు గ్రామస్తుల సహకారంతో బస్సు దిగి సురక్షితంగా బయట పడటంతో ప్రమాదం తప్పింది. బస్సులోని ప్రయాణికులను ఆయా సొంత ప్రాంతాలకు తరలించేందుకు రెవెన్యూ అధికారులు ప్రైవేటు వాహనాన్ని ఏర్పాటు చేశారు. కాగా ప్రమాద ఘటనపై ఆర్టీసీ, పోలీసు అధికారులు విచారణ జరుపుతున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
