
జీడీపీలో తగ్గిన నీటి నిల్వ
గోనెగండ్ల: ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురువక పోవడంతో గాజులదిన్నె ప్రాజెక్టులో నీరు అడుగంటి పోతుంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 4.5 టీఎంసీలు కాగా బుధవారం నాటికీ జీడీపీలో 1.65 టీఎంసీల నీటి నిల్వ (గ్రాస్) మాత్రమే ఉంది. డోన్, పత్తికొండ, క్రిష్ణగిరి మండలాల తాగునీటి పథకాలకు నీరు సరఫరా అవుతుంది. దీంతో జీడీపీలో రోజురోజుకు నీరు అడుగంటిపోతుంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో అశించినంత వర్షాలు కురువకపోవడంతో జీడీపీలోకి వరద నీరు చేరలేదు. గతంలో జూన్ చివరి నాటికి ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరేది. ఈ ఏడాది వర్షాలు కురువకపోవడంతో జూలైలో సగం రోజులు గడిచినప్పటికీ ప్రాజెక్టులోకి వరద నీరు చేరలేదు. దీంతో ప్రాజెక్టులో నీరు లేక వెలవెలబోతుంది. వర్షాలు సమృద్ధిగా కురిసి వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరితేనే ఆయకట్టు భూములు పంటల సాగుతో కళకళలాడుతాయి. సాగుచేసిన పంటలు కళకళలాడాలంటే వర్షం కురవాలని రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు.
నాయకత్వ లక్షణాలు మెరుగుపర్చుకోవాలి
బండి ఆత్మకూరు: ప్రధానోపాధ్యాయులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి జనార్ధన్ రెడ్డి సూచించారు. మండలంలోని పార్నపల్లి ప్రభాత్ కాలేజీలో ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలల హెడ్ మాస్టర్లకు జరుగుతున్న జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు నంద్యాల జిల్లా విద్యాశాఖాధికారి జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ లీడర్‌గా ఎదగాలి, నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలి, తోటి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో, విద్యార్థులతో ఎలా మెలగాలన్న విషయాలపై దిశా నిర్దేశం చేశారు. అనంతరం సంతజూటూరు జిల్లా పరిషత్ హైస్కూల్‌ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. నంద్యాల జిల్లా ఆల్టర్నేట్ కో–ఆర్డినేటర్ ప్రసన్నకుమార్ రెడ్డి, ఎంఐఎస్ కో ఆర్డినేటర్ జగన్‌మోహన్ రెడ్డి, మండల విద్యాశాఖాధికారి యశోధ, సమగ్ర శిక్ష అభియాన్ డీటీపీ గాయత్రి, ఫిజికల్ డైరెక్టర్ నాగరాజు, పీఆర్‌టీలు మస్తానయ్య, భానుబీ పాల్గొన్నారు.

జీడీపీలో తగ్గిన నీటి నిల్వ