ప్రియుడు, మరికొందరి సహకారంతో భర్త ఊపిరి తీసిన భార్య | - | Sakshi
Sakshi News home page

అరుణ ఫోన్‌లో ఎవరితో మాట్లాడింది.?

Sep 27 2023 2:04 AM | Updated on Sep 27 2023 10:46 AM

- - Sakshi

నల్గొండ: సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం నాణ్యతండా ఆవాసం పూర్యతండా సమీపంలో శనివారం రాత్రి జరిగిన నూతనకల్‌ మండలం బక్కహేమ్లాతండాకు చెందిన గుగులోతు చాంప్ల హత్య కేసు మిస్టరీ వీడుతున్నట్లు తెలిసింది. సఖ్యతకు అడ్డొస్తున్నాడన్న కారణంతోనే హతుడి భార్య అరుణ తన ప్రియుడు, మరికొందరి సహకారంతో ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నూతనకల్‌ మండలం బక్కహేమ్లాతండాకు చెందిన గుగులోతు చాంప్ల(38) తండాలో వ్యవసాయంతోపాటు జాజిరెడ్డిగూడెం మండలం నాణ్యతండా ఆవాసం పూర్యతండా సమీపంలో గుట్టల వద్ద బొగ్గు బట్టీలు పెడుతూ భార్యా, పిల్లలను పోషించుకుంటున్నాడు.

పథకం ప్రకారమే..
తన సఖ్యతకు భర్త చాంప్ల అడ్డువస్తున్నాడని భార్య అరుణ పథకం ప్రకారం ప్రియుడు, మరికొందరి సహకారంతో హత్య చేసినట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి బొగ్గుబట్టీల వద్ద నిద్రిస్తున్న సమాచారాన్ని అరుణ ముందే తన ప్రియుడికి ఫోన్‌లో సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అతను మరో ఇద్దరితో కలిసి పూర్యాతండా శివారులోని బొగ్గుబట్టీల వద్దకు వచ్చి కొట్టంలో పడుకున్న చాంప్లపై దాడి చేసి అనంతరం ఒకరు కాళ్లు పట్టుకొని మరికొందరు అతడి మెడకు తాడు బిగించి ఊపిరి ఆడకుండా హత్య చేసిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారని సమాచారం.

ఘటనా స్థలంలో అరుణ ధరించిన కొన్ని గాజుల ముక్కలతో పాటు తలకు పెట్టుకున్న పూలు కూడా చాంప్ల మృతదేహం వద్ద రాలిపోయాయి. ఆమె చెవుకు ధరించిన దిద్దును కూడా అక్కడే పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. చాంప్లపై దాడి చేస్తున్న క్రమంలో జరిగిన పెనుగులాటలో అరుణ ధరించిన వస్తువులు కిందపడి పోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇనుప రాడ్డుతో చాంప్లను కొట్టగా ఒంటిపై గాయాలైనట్లు గిరిజనులు చెబుతున్నారు. వీటికి తోడు హతుడి కుమారుడు ధనుష్‌ తండావాసుల వద్ద వీడియోలో చెప్పిన మాటలు అరుణపై వస్తున్న ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. హతుడి తల్లి ఫిర్యాదు మేరకు అరుణతో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు తెలిసింది.

కీలకం కానున్న కాల్‌డేటా రికార్డు (సీడీఆర్‌)
ఈ హత్య కేసులో అరుణ సెల్‌ఫోన్‌ కాల్‌డేటా రికార్డు (సీడీఆర్‌)కీలకం కానున్నట్లు తెలుస్తోంది. హత్యోదంతానికి ముందు అరుణ ఫోన్‌లో ఎవరితో మాట్లాడింది.? ఈ కేసులో అరుణ, ఆమె ప్రియుడితో పాటు ఇంకెంత మంది పాత్రధారులు ఉన్నారు? నిందితులకు పరోక్షంగా సహకరించిన వారెందరు? వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగిందా..? మరో కారణం ఏమైనా ఉందా..? ఇలా అన్ని కోణాల్లో పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం. అరుణ కాల్‌డేటా రికార్డు ఆధారంగానే కేసు చిక్కుముడి పూర్తి స్థాయిలో వీడనున్నట్లు తెలుస్తోంది.

ఒంటరైన ముగ్గురు పిల్లలు
చాంప్ల హత్యతో వారి ముగ్గురు పిల్లలు ఝాన్సీ, రోహిత, ధనుష్‌ ఒంటరయ్యారు. ఝాన్సీ, రోహిత నకిరేకల్‌ సమీపంలోని గురుకుల పాఠశాలలో 6, 3వ తరగతులు చదువుతున్నారు. ధనుష్‌ తల్లిదండ్రులతో కలసి ఉంటూ గ్రామంలో ఒకటో తరగతి చదువున్నాడు. క్షణిక సుఖానికి భర్తను కడతేర్చి పిల్లలకు తండ్రి లేకుండా చేసిందని, దారుణానికి పాల్పడి తానూ కటకటాల పాలై వారిని అనాథలుగా మార్చిందని పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన హేమ్లాతండావాసులు అరుణను తిట్టిపోశారు.

అమ్మ ఫోన్‌ లాక్కుంది : ధనుష్‌, హతుడి కుమారుడు
బక్కహేమ్లాతండా వాసులు మంగళవారం చాంప్ల ముగ్గురు పిల్లలను తీసుకొని అర్వపల్లి స్టేషన్‌కు తీసుకొచ్చారు. అక్కడ హతుడు చాంప్ల కుమారుడు ధనుష్‌తో మాట్లాడించారు. ‘నాన్నను ఎవరో కొడుతుండగా ఆయన కేకలు వేయడంతో నేను నిద్రలేచా. మంచంలో ఉన్న అమ్మ ఫోన్‌ తీసుకుని తాత మంగ్యాకు ఫోన్‌ చేయబోయా. అమ్మ తన వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ లాక్కుని పడుకో అంటూ నా ముఖంపై చద్దరు కప్పి పడుకోబెట్టింది’ అంటూ ఏడేళ్ల బాలుడు తండ్రి హత్య జరిగిన తీరును వివరించడంతో అక్కడున్న వారందరూ కన్నీరుమున్నీరయ్యారు.

నా కూతురును కఠినంగా శిక్షించాలి
– అరుణ తండ్రి కేతావత్‌ మంగ్యా
తన అల్లుడు చాంప్ల ఎంతో మంచి వాడని, అలాంటి వ్యక్తిని హత్య చేయడం దారుణమని అరుణ తండ్రి కేతావత్‌ మంగ్యా పేర్కొన్నారు. అర్వపల్లిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన అల్లుడిని కూతురు అరుణ కొందరితో కలిసి హత్య చేసినట్లు తెలిసిందని విలపిస్తూ చెప్పాడు. తన అల్లుడు చాంప్లను కూతురు అరుణ చంపినట్లు నిర్ధారణ అయితే కఠినంగా శిక్షించాలని, అందుకు మా కుటుంబం బాధ పడదన్నారు. తాను అనారోగ్యం పాలై ఆస్పత్రిలో ఉంటే తన అల్లుడు చాంప్ల దగ్గర ఉండి నెల రోజులు సేవలందించి బతికించాడని చెబుతూ మంగ్యా బోరుమన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement