నాగర్‌కర్నూల్ రూరల్: కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు, పంటల సాగుకు అవసరమైన పెట్టుబడుల కోసం రైతులు అనేక కష్టాలు పడుతున్నా.. ప్రభుత్వానికి పట్టడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సాగర్ విమర్శించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటుచేసిన ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వానాకాలం సాగు ప్రారంభమైనా ప్రభుత్వం రైతుభరోసా ఊసెత్తకపోవడం దారుణమన్నారు. మరోవైపు నెలరోజుల క్రితం రైతుల నుంచి కొనుగోలుచేసిన మొక్కజొన్నల డబ్బులను కూడా చెల్లించలేదన్నారు. ప్రభుత్వం తక్షణమే రైతాంగానికి రైతుభరోసా నిధులు విడుదల చేయడంతో పాటు ధాన్యం డబ్బులను బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు, ఆర్.శ్రీనివాసులు, ఆంజనేయులు, దేశ్యానాయక్, పొదిల రామయ్య, నర్సింహ, ఎం.శ్రీనివాసులు, శంకర్ నాయక్, శివవర్మ, బాలస్వామి, అశోక్, అంతటి కాశన్న, నాగరాజు, సైదులు, హనుమంతు ఉన్నారు.
పాలమూరు రెడ్‌క్రాస్‌కు మొదటి బహుమతి
పాలమూరు: రాష్ట్రంలో అత్యధికంగా 7323 యూనిట్ల రక్త నిల్వలు సేకరించి మొదటి స్థానంలో నిలిచిన మహబూబ్‌నగర్ ఇండియన్ రెడ్‌క్రాస్ రక్తనిధి కేంద్రానికి ఆదివారం హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతులమీదుగా రెడ్‌క్రాస్ చైర్మన్ నటరాజ్ బహుమతి అందుకున్నారు. 2025– 26 సంవత్సరంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు, రక్తమార్పిడి సేవలలో విశేష సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు అందించారు. గత 24 ఏళ్లుగా రక్త సేకరణలో మహబూబ్‌నగర్ రెడ్‌క్రాస్ రక్తనిధి కేంద్రం అగ్రస్థానంలో నిలుస్తుందని నటరాజ్ వెల్లడించారు.
నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లాలోని నిరుద్యోగ యువతకు అమర్‌రాజా ఈఎస్‌ఎస్‌సీఐ ఆధ్వర్యంలో ఉపాధి రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ సెంటర్ మేనేజర్ ఆనంద్‌కుమార్ ఆదివారం ఒక ప్రకనటలో తెలిపారు. ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రిక్ వెహికిల్ సర్వీస్, ఏసీ టెక్నీషియన్ రంగాల్లో 90 రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనునట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం సెల్ నంబర్లు 73034 44397, 73034 44561లను సంప్రదించాలని సూచించారు.


