గద్వాల కాంగ్రెస్‌లో అదే తీరు..
మరోసారి వర్గ రాజకీయాలకు వేదికగా మారిన ముఖ్య కార్యకర్తలవిస్తృతస్థాయి భేటీ
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో..
హరిత హోటల్‌లో సరిత వర్గంతో..
చర్చనీయాంశంగా పరిశీలకుల తీరు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: గద్వాల అంటేనే గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు. ఇది నిజమేనని మరోసారి రుజువైంది. పార్టీ ఒక్కటే.. సమావేశాలు మాత్రం రెండు చోట్ల జరిగాయి. బుధవారం జిల్లాకేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం గ్రూప్ రాజకీయాలకు వేదికగా మారింది. వచ్చిన పరిశీలకులకు సైతం ఒకింత ఇబ్బందిపడినట్లు సమాచారం.
భిన్నాభిప్రాయాలు..
కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర పరిశీలకులు విశ్వనాథ్, దీపక్‌జాన్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ బుధవారం గద్వాలలో జరిగిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. అయితే గద్వాలలో ఉన్న రెండు గ్రూపులను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే బండ్లతో ఆయన క్యాంపు కార్యాలయంలో, సరిత వర్గంతో హరిత హోటల్‌లో సమావేశాలు నిర్వహించారు. అయితే పరిశీలకులే వేర్వేరుగా సమావేశాలు నిర్వహించడంపై పార్టీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వర్గ విభేదాలను ప్రోత్సహించేలా పరిశీలకులే వ్యవహరించారని ఓవైపు.. వేర్వేరుగా అయితేనే ఇరువర్గాల మధ్య రాజీ కుదుర్చడం సులువవుతుందని మరోవైపు పార్టీలో చర్చ జరుగుతోంది.
2, 3 రోజుల్లో శుభవార్త..
సరిత వర్గంతో భేటీ సందర్భంగా పార్టీలో ముందు నుంచి పనిచేసిన వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని, పార్టీ ఏ ఒక్క నాయకుడు, కార్యకర్తను వదులుకోదని ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర పరిశీలకుడు విశ్వనాథ్ అన్నారు. సరితకు రెండు, మూడు రోజుల్లో శుభవార్త వస్తుందని సైతం హామీ ఇచ్చినట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. కాగా.. బండ్ల, సరిత మధ్య బీఆర్‌ఎస్ పార్టీలో కొనసాగిన ఆధిపత్య పోరు కాంగ్రెస్‌లో సైతం కొనసాగుతుండటంపై పరిశీలకుల మధ్య హాట్‌హాట్‌గా చర్చ జరిగినట్లు పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి.