శానిటరీ నాప్‌కిన్ యాడ్.. వివాదంపై విఘ్నేశ్ శివన్ క్లారిటీ | Vignesh Shivan breaks silence on normal people viral video controversy | Sakshi
Sakshi News home page

Vignesh Shivan: 'శానిటరీ నాప్‌కిన్ యాడ్.. ఆ మాటను వక్రీకరించారు'

Apr 16 2026 4:34 PM | Updated on Apr 16 2026 5:17 PM

Vignesh Shivan breaks silence on normal people viral video controversy

లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించగా.. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్‌గా మెప్పించింది. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీని నయనతార సొంత బ్యానర్ రౌడీ పిక్చర్స్‌ సంస్థ, ఎస్‌ ఎస్‌. లలిత్‌కుమార్‌కు చెందిన సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియో బ్యానర్లపై  నిర్మించారు.

ఇదిలా ఉండగా.. నయన్, విఘ్నేశ్ శివన్‌ ఓ శానిటరీ నాప్‌కిన్‌ యాడ్‌లో నటించారు. ఈ యాడ్ ప్రమోషన్ కోసం ఇన్‌ఫ్లుయెన్సర్లను ఆహ్వానించి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో యాడ్ మేనేజర్ చేసిన కామెంట్స్‌ వివాదానికి కారణమయ్యాయి. 'దయచేసి సహకరించండి.. వీళ్లు సాధారణ ప్రజలు కాదు'.. అంటూ అక్కడున్న ఇన్‌ఫ్లూయన్సర్లను సముదాయించే ప్రయత్నం చేశాడు. దీంతో కార్యక్రమానికి హాజరైన ఇన్‌ఫ్లుయెన్సర్లు నయన్- విఘ్నేశ్ జంటకు అధిక ప్రాధాన్యత కల్పించడాన్ని విమర్శించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  తాజాగా ఈ  వివాదానికి గల కారణంపై విఘ్నేశ్ శివన్ క్లారిటీ ఇచ్చారు.

నిజానికి మేనేజర్ అక్కడ 'మేము సాధారణ ప్రజలం కాదు.. మేము ఇన్‌ఫ్లుయెన్సర్లం' అని చెప్పారని విఘ్నేశ్ శివన్ క్లారిటీ ఇచ్చాడు. ఆ వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన వారు ఎడిట్ చేసి పెట్టారని అన్నారు. లైకులు, వ్యూస్‌ కోసం 'మేము' అనే పదాన్ని 'వారు'గా మార్చి వక్రీకరించారని తెలిపారు. ఆ తర్వాత మేము ఆ వీడియో పోస్ట్ చేసిన వ్యక్తిని సంప్రదించగా.. దానికి ఎక్కువ వ్యూస్‌ వస్తున్నందున ఆ వీడియోను అలాగే ఉంచేలా సహకరించాలని మమ్మల్ని అతను కోరాడని విఘ్నేశ్ వెల్లడించారు. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్‌ పడినట్లైంది.

Advertisement
 
Advertisement
Advertisement