Sirivennela Seetharama Sastry : ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి (1955 – 2021)

Special Story On Sirivennela Seetharama Sastry Biography - Sakshi

Sirivennela Seetharama Sastry: రోజుకి 19 గంటల పాటు ఏకాంతంగా... ఏకధాటిగా 30 ఏళ్లు పాటతోనే జీవించిన ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి ‘అంతర్యామి అలసితి సొలసితి...’  అంటూ అక్షరాల నుంచి సెలవు తీసుకున్నారు. సిరివెన్నెలలు పంచడానికి వెన్నెల చెంత చేరారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం దోసూరు గ్రామంలో 1955 మే 20న డా. చేంబోలు వెంకట యోగి, సుబ్బలక్ష్మీ దంపతులకు సీతారామశాస్త్రి జన్మించారు. వెంకట యోగి, సుబ్బలక్ష్మీ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు, ఐదుగురు అమ్మాయిలు కాగా సీతారామశాస్త్రి తొలి సంతానం. పదో తరగతి వరకూ అనకాపల్లిలో చదువుకున్న సీతారామశాస్త్రి కాకినాడలో ఇంటర్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత ఐటీఐ కాలేజీ లెక్చరర్‌గా వెంకట యోగికి కాకినాడకు బదిలీ కావడంతో సీతారామశాస్త్రి ఇంటర్మీడియెట్‌ చదువు అక్కడే సాగింది.

కాగా వెంకట యోగికి హోమియోపతి వైద్యంలో ప్రవేశం ఉండటంతో సీతారామశాస్త్రిని మెడిసిన్‌  చదివించాలనుకున్నారు. అలా విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్య కళాశాలలో 1973లో ఎమ్‌బీబీఎస్‌లో చేరారు. అయితే ఎమ్‌బీబీఎస్‌లో చేరే ముందే కుటుంబ పోషణ విషయంలో ఇబ్బందిపడుతున్న తండ్రికి సాయం చేయాలని టెలిఫోన్‌ శాఖలో అసిస్టెంట్‌ ఉద్యోగానికి అప్లై చేశారు. కానీ ఎమ్‌బీబీఎస్‌లో చేరారు. అప్పటివరకు సీతారామశాస్త్రికి మొదటి బెంచ్‌లో కూర్చొనే అలవాటు ఉంది. కానీ ఎమ్‌బీబీఎస్‌లో చివరి బెంచ్‌ దొరికింది. పైగా లెక్చరర్స్‌ చెప్పే పాటలు అర్థం అయ్యేవి కావు. ఎందుకంటే అప్పుడు ఇంగ్లిష్‌లో సీతారామశాస్త్రికి అంతగా ప్రావీణ్యత లేదు.

చివరి బెంచ్‌లో కూర్చున్న ఆయనకు బ్లాక్‌బోర్డ్‌ సరిగ్గా కనిపించకపోవడంతో, తనకు కంటి సమస్య ఉందని గ్రహించి, బాధపడ్డారు. ఇంగ్లిష్‌ సమస్య, ఐ సైట్‌... ఈ రెంటితో పాటు ఉమ్మడి కుటుంబ పోషణ విషయంలో తండ్రి ఇబ్బంది.... ఈ మూడు అంశాలు సీతారామశాస్త్రికి చదువుపై ఏకాగ్రత నిలవనివ్వకుండా చేశాయి. అదే సమయంలో టెలిఫోన్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరమని కబురు రావడంతో ఎమ్‌బీబీఎస్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టి, 300 రూపాయలకు టెలిఫోన్‌ శాఖలో అసిస్టెంట్‌గా చేరారు. అయితే తండ్రికి మాత్రం తాను ఓపెన్‌ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేస్తానని మాటిచ్చారు. అన్నట్లుగానే ఆ తర్వాత బీఏ చేశారు. అంతా సజావుగా సాగుతున్న సమయంలో 40 ఏళ్ల వయసులోనే తండ్రి మరణించడంతో కుటుంబ పోషణ భారమంతా సీతారామశాస్త్రిపై పడిపోయింది.

తండ్రి హోమియోపతి వైద్యాన్ని సీతారామశాస్త్రి తమ్ముడు చూసుకున్నారు. ఆ తర్వాత సీతారామశాస్త్రి తమ్ముడికి ఉద్యోగం దొరికింది. సోదరీమణుల వివాహాలను ఈ ఇద్దరు అన్నదమ్ములు జరిపించారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే కాకినాడలో సాంస్కృతిక కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్న సీతారామశాస్త్రికి ‘కళా సాహితి సమితి’తో పరిచయం కలిగింది. ఈ ప్రయాణంలో భాగంగానే సీవీ కృష్ణారావు, ఇస్మాయిల్, సోమసుందర్, ఆకెళ్ల సూర్య వెంకటనారాయణ వంటి ప్రముఖ సాహితీవేత్తలతో సీతారామశాస్త్రికి సాన్నిహిత్యం ఏర్పడింది. అప్పుడే ‘భరణి’ అనే కలం పేరుతో సీతారామశాస్త్రి రాసిన రచనలు ఆంధ్రప్రభ, విజయ తదితర పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. ఇదే టైమ్‌లో ఆకెళ్ల సూర్య వెంకటనారాయణ సినిమాల్లోకి వెళ్లారు.

ఇదిలా ఉండగా.. 1980లో కె. విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘శంకరాభరణం’ సినిమా విజయోత్సవాల్లో భాగంగా కాకినాడలో ఓ వేడుక ఏర్పాటు చేశారు. కె. విశ్వనాథ్‌కి ఓ స్వాగతగీతాన్ని రాయాల్సిందిగా సీతారామశాస్త్రిని కోరారు ఆకెళ్ల. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత ఓ సందర్భంలో కె. విశ్వనాథ్‌ పాల్గొన్న ఓ వేడుకలో సీతారామశాస్త్రి రాసిన ‘గంగావతరణం’ పాటను కె. విశ్వనాథ్‌  స్వాగత గీతంగా ఆలపిం చారు. విశ్వనాథ్‌కి ఈ పాట నచ్చింది. ఈ పాట ఎవరు రాశారో తెలుసుకోవాలని ప్రయత్నించగా ఆయనకు భరణి (సీతారామశాస్త్రి కలం పేరు) అని తెలిసింది. భరణి అనేది సీతారామశాస్త్రి కలం పేరు అని తెలుసుకున్న కె. విశ్వనాథ్‌ ఆయన్ను కలవాలనుకున్నారు.

అంతేకాదు.. సీతారామశాస్త్రి రాసిన ‘గంగావతరణం’ పాటను తన సినిమా (బాలకృష్ణ హీరోగా నటించిన ‘జననీ జన్మభూమి)లో వినియోగించాలనుకుంటున్నట్లుగా కబురు పంపారు. ‘‘ఓ సందర్భంలో ‘గంగావతరణం’ పాటను మీ కోసమే రాశాను. ఇప్పుడు అది మీ చెంతకు చేరడం, మీ సినిమాలో వినియోగించుకోవాలనుకోవడం హ్యాపీగా ఉంది’’ అన్నారు సీతారామశాస్త్రి. అయితే ఈ సినిమా పాటల రచయిత విభాగంలో క్రెడిట్‌ కావాలని విశ్వనాథ్‌ని కోరారు సీతారామశాస్త్రి. విశ్వనాథ్‌ ఓకే అన్నారు. తాను గురువుగా భావించే వేటూరి సుందర రామమూర్తి పేరు కింద తన పేరు ‘చేంబోలు సీతారామశాస్త్రి (భరణి)’ అనే టైటిల్‌ను సిల్వర్‌ స్క్రీన్‌పై చూసుకుని ఆనందపడిపోయారు. 
ఇంటి పేరుగా మారిన ‘సిరివెన్నెల’

‘సిరివెన్నెల’ (1986)తో సీతారామశాస్త్రి సినిమా కెరీర్‌ పూర్తిగా మొదలైంది. చిత్రదర్శకుడు కె. విశ్వనాథ్‌ ‘సిరివెన్నెల’ కథ చెప్పి ఓ పాట రాయాల్సిందిగా కోరారు. ‘విధాత తలపున..’ అని రాశారు సీతారామశాస్త్రి. విశ్వనాథ్‌కి చాలా బాగా నచ్చింది. అంతే.. ఈ చిత్రంలోని మొత్తం పాటలూ నువ్వే రాస్తున్నావని సీతారామశాస్త్రితో అన్నారు. అది మాత్రమే కాదు.. ఈ సినిమా పేరుతోనే విశ్వనాథ్‌ ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అని టైటిల్‌ కార్డ్‌ వేశారు. అప్పటినుంచి ఇప్పటివరకూ పాటల వెన్నెలలు పంచారు ‘సిరివెన్నెల’. ఆ సినిమాలోని ‘విధాత తలపున’ పాటకు సిరివెన్నెల అల్మరాలో ‘నంది’ కూడా చేరింది. ఆ తర్వాత విశ్వనాథ్‌–సిరివెన్నెల కాంబినేషన్‌లో పలు సూపర్‌ హిట్‌ పాటలు వచ్చాయి. అందుకు శ్రుతిలయలు, స్వయం కృషి, స్వర్ణకమలం, సూత్రధారులు, ఆపద్బాంధవుడు, స్వాతికిరణం, శుభసంకల్పం లాంటి చిత్రాల్లోని పాటలు ఓ ఉదాహరణ. 

మూడు దశాబ్దాల్లో ...
ఒక్క విశ్వనాథ్‌ అనే కాదు.. సిరివెన్నెల ప్రతి దర్శకుడికీ హిట్‌ పాటలు ఇచ్చారు. ‘శివ’ సినిమాలో రామ్‌గోపాల్‌ వర్మకు ‘బోటనీ పాఠముంది..’ అని రాశారు. అదే వర్మకు ‘క్షణక్షణం’లో ‘కో అంటే కోటి, జాము రాతిరి జాబిలమ్మా’, ‘గాయం’లో ‘అలుపన్నది ఉందా, నిగ్గ దీసి అడుగు’, నంది అవార్డు సాధించిన ‘స్వరాజ్యమవలేని’ పాటలు రాశారు. మరోవైపు కృష్ణవంశీకి ‘గులాబి’ కోసం ‘ఈవేళలో నీవు ఏం చేస్తు ఉంటావు..’, ‘ఏ రోజైతే∙చూశానో నిన్నూ..’ రాశారు.

‘సిరివెన్నెల’ రాసిన ‘జగమంత కుటుంబం నాది..’ పాట విని, ఆ పాట కోసమే సినిమా తీయాలని కృష్ణవంశీ తీసిన చిత్రం ‘చక్రం’. శివనాగేశ్వ రావు ‘మనీ’లో ‘చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకీ, భద్రం బీ కేర్‌ ఫుల్‌ బ్రదరూ..’ అని రాశారు. ఒకటా.. రెండా వేల పాటలు రాశారు. మూడు దశాబ్దాల కెరీర్‌లో త్రివిక్రమ్, గుణశేఖర్, క్రిష్, రాజమౌళి ఇలా ఎందరో దర్శకులకు పాటలు రాశారు. విడుదలకు సిద్ధమవుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ‘దోస్తీ..’ పాట, ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో రెండు పాటలు రాశారు. సిరివెన్నెల నుంచి ఇంకా ఎన్నో పాటలు వచ్చి ఉండేవి. ‘జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది’ అంటూ ఒంటరిగా వెళ్లిపోయారు ‘సిరివెన్నెల’.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top