Ravi Teja Upcoming Movies: వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టేస్తున్న మాస్‌ మహారాజా

Happy Birthday Ravi Teja Interesting updates about his new movies - Sakshi

కృష్ణానగర్‌ కష్టాలకు కేర్‌ ఆఫ్‌ ఎడ్రస్‌..సినిమానే లైఫ్‌ ర మామా, లైఫ్‌ అంతా సినిమా మామా అంటూ తెలుగోడి గుండెల్లో ముద్రవేసుకున్న మాస్‌ మహారాజా రవితేజా.  పిచ్చిపిచ్చిగా నచ్చేసిన సినిమా ఫీల్డ్‌లో కష్టంతో నిల దొక్కుకుని నట విశ్వరూపాన్ని చూపించిన విక్రమార్కుడు. స్లో అండ్ స్టడీగా ఒక్కోమెట్టు ఎక్కుతూ బ్లాక్‌బస్టర్‌ రేంజ్‌కి ఎదిగాడు.  జనవరి 26 రవితేజ పుట్టిన రోజు సందర్భంగా  మాస్‌ రాజాకు కిక్కు ఇచ్చిన సినిమా విశేషాలపై ఓ లుక్కేద్దాం.

1968 జనవరి 26న ఆంధ్రప్రదేశ్ జగ్గంపేటలో జన్మించిన రవితేజ చిన్నప్పుడే సినిమాల్లోకి రావాలని ఎన్నో కలలు కన్నాడు. సినిమానే శ్వాసించి, సినిమానే జీవితంగా, సినిమా తప్ప మరో ప్రపంచం లేదన్నట్టుగా ఎదిగిన రవితేజ అసలు పేరు  భూపతిరాజు రవి శంకర్ రాజు. అయితే దర్శకుడు కావాలనే పట్టుదలతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రవితేజ విచిత్రంగా నటుడిగా అవతరించాడు. దర్శకుడు కృష్ణవంశీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న క్రమంలో 1997లో కృష్ణవంశీ తీసిన సింధూరం మూవీలో సెకండ్ హీరోగా ఆకట్టు కున్నాడు. ఆ తరువాత 35 ఏళ్లవయసులో హీరోగా వెండితెరకు పరిచయ మయ్యాడు. తన ప్రతిభతో వన్ బై వన్ హిట్స్ కొడుతూ మార్కెట్ పరిధిని విస్తరించుకున్నాడు. ఊర మాస్ చిత్రాలతో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేసి ‘మాస్ మహారాజా’ అనే ట్యాగ్ సొంతం చేసు కున్నాడు. ఫ్లాప్‌ లొచ్చినా, నష్టపోయినా బెదిరిపోలేదు. పడి లేచినకెరటంలా నేనింతే అని నిరూపించుకున్నాడు. ఖడ్గం, నా ఆటోగ్రాఫ్‌, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, కృష్ణ లాంటి బ్లాక్‌ బ్లస్టర్‌ మూవీలను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో గుణశేఖర్, వైవిఎస్.చౌదరి, లాంటి దర్శకులతో ఉన్న పరిచయ  రవితేజ కరియర్‌కు బాటలు వేశాయి. వీరి కలయికలో అప్పట్లో నిప్పు సినిమా కూడా వచ్చింది. అవమానాలను ఆకలిని లెక్క చేయలేదు. ఒక్క చాన్స్‌ అంటూ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు.  శ్రీను వైట్ల దర్శకత్వంలో నీ కోసం సినిమాతో హీరోగా పరిచయమై, ఒక్కోమెట్టూ ఎదుగుతూ స్టార్‌ ఇమేజ్‌ను సంపాదించుకున్న  టాలెంటెడ్‌ నటుడు రవితేజ. తనదైన నటన, పంచ్‌డైలాగులు, బాడీ లాంగ్వేజ్‌‌,  మేనరిజంతో ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.

ఔను వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, వీడే, దొంగోడు, డాన్ సీను, విక్రమార్కుడు, వెంకీ, భద్ర, దుబాయ్ శీను,  షాక్‌, నా ఆటోగ్రాఫ్ స్వీట్‌ మొమరీస్‌, శంభో శివ శంభో, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, కిక్, కిక్‌-2,  రాజా ది గ్రేట్  అమర్ అక్బర్ ఆంటోని, డిస్కో రాజా లాంటి సినిమాలతో తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. 2008లో నేనింతే మూవీకి ఉత్తమ నటుడుగా నంది పురస్కారం అందుకున్నాడు.  ఇటీవల గోపిచంద్ మలినేని దర్శకత్వంలో  ‘క్రాక్’ సినిమా కలెక్షన్ల మోత మోగించింది. 50కోట్ల వసూళ్లతో రవితేజ కెరీర్ లోనే బిగెస్ట్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది.

అంతేకాదు 2022లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు రవితేజ. ఒకేసారి 5 సినిమాలను లైన్లోపెట్టేశాడు. రమేష్ వర్మ  దర్శకత్వంలో  రూపొందుతున్న ఖిలాడీ 2022, ఫిబ్రవరి 11న విడుదల కానుంది. కొత్త దర్శకుడు శరత్ మండవ తెరకెక్కిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ షూటింగ్‌ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.  రవితేజ పుట్టిన రోజున రామారావు ఫస్ట్‌ లుక్‌ విడుదల కానుంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో   ధమాకా అనే మరో చిత్రం  కూడా పట్టాలెక్కనుంది. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ కూడా జనవరి 26న విడుదల కానుంది. 

స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌గా, వంశీ తెరకెక్కిస్తున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోనూ విడుదల కానుంది. దీనికోసం రికార్డు స్థాయిలో రవితేజ 18 కోట్ల రెమ్యునరేషన్ తీసు కుంటున్నాడట. యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రానున్న మరో సినిమా రావణాసుర. వీటితో పుట్టిన రోజు కానుకగా ఒకటాప్‌ డైరెక్టర్‌ డైరెక్షన్‌లో మరో సినిమాను కూడా ప్రకటించబోతున్నాడట. మాస్‌ రాజా స్పీడ్‌ చూసి స్టార్‌హీరోలు కూడా షాక్‌ అతున్నారని  టాలీవుడ్‌ టాక్‌. మొత్తానికి ఒకేరోజు 6 సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ చెప్ప నున్నాడంటూ ఫ్యాన్స్‌ తెగ పండుగ చేసుకుంటున్నారు. మాంచి కిక్కు ఇచ్చే చిత్రాలతో మాస్ మహారాజ్ ప్రేక్షకులను మరింత అలరించాలని కోరుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top