
ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ తన కంటే వయసులో పెద్దదైన సానియా చందోక్‌ను పెళ్లాడబోతున్నాడు. ఈ విషయంలో తండ్రి బాటలో పయనిస్తున్నాడు. సచిన్ కూడా తన కంటే వయసులో పెద్ద అయిన అంజలిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. చాలా మంది ప్రముఖులు ఇదే విధంగా పెళ్లిళ్లు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. 56 ఏళ్ల క్రితం ఓ నటుడు తన కంటే వయసులో 15 ఏళ్లు పెద్దదైన మహిళను పెళ్లాడాడంటే నమ్మగలరా? ఆ నటుడు ఎవరో తెలుసుకోవాలని ఉందా? అయితే మీకు బాలీవుడ్ దిగ్గజ నటుడు నసీరుద్దీన్ షా మొదటి వివాహం గురించి చెప్పాల్సిందే!
ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా (Naseeruddin Shah) భార్య రత్న పాఠక్ అని చాలా మందికి తెలుసు. కానీ ఆయన మొదటి భార్య పర్వీన్ మురాద్ గురించి ఎక్కువ మందికి తెలియదు. నటుడిగా నిలదొక్కుకోకముందే ఆయన పెళ్లయిపోయి, విడాకులు కూడా తీసేసుకున్నారు. మొదటి భార్యకు భరణం చెల్లించడానికే 12 ఏళ్ల పాటు కష్టాలు పడ్డారట షా.
బాలీవుడ్ షాదీస్ ప్రచురించిన ఒక కథనం ప్రకారం.. నసీరుద్దీన్ అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడు పర్వీన్‌ను మొదటిసారి కలిశారు. అప్పటికి అతడి వయసు 19 ఏళ్లు. 34 ఏళ్ల పర్వీన్ అప్పటికే భర్త నుంచి విడాకులు తీసుకుని తన పిల్లలతో కలిసి జీవిస్తోంది. విద్యార్థిగా ఉన్న షా.. 1969లో సంప్రదాయబద్దంగా పర్వీన్‌ను పెళ్లిచేసుకున్నాడు. సంవత్సరం లోపు వీరికి కూతురు పుట్టింది. ఆమెకు హీబా అని పెట్టుకున్నారు. తర్వాత వీరి వివాహ బంధానికి బీటలు వారాయి.

విడాకుల కష్టాలు
పర్వీన్‌ను షా పెళ్లిచేసుకోవడం మొదటి నుంచి నసీరుద్దీన్ కుటుంబానికి ఇష్టం లేదు. విడాకులు తీసుకుని పిల్లలు ఉండడం, వయసులో ఎక్కువ వ్యత్యాసం కారణంగా వీరి వివాహాన్ని ఆమోదించలేదు. ఫలితంగా షా, పర్వీన్ కాపురంలో కలతలు రేగాయి. దీంతో వారిద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. విడాకులు ఇవ్వడానికి పర్వీన్ కుటుంబం భారీగా భరణం చేయడంతో షా ఒప్పుకున్నారు. నటన కొనసాగిస్తూనే భార్యకు భరణం చెల్లించారు. మసూమ్ చిత్రంతో బ్రేక్ రావడంతో తన మాజీ భార్యకు పూర్తిగా భరణం చెల్లించేశారని, దీనికి దాదాపు 12 సంవత్సరాలు పట్టిందని పలు మీడియా నివేదికలు వెల్లడించాయి.
రత్న పాఠక్‌తో రెండో పెళ్లి
1975లో థియేటర్‌లో పనిచేస్తున్న సమయంలో నసీరుద్దీన్ షాకు రత్న పాఠక్ (Ratna Pathak) పరిచయం అయ్యారు. వారి మధ్య స్నేహం ప్రేమగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అప్పటికింకా చట్టబద్దంగా షా మొదటి వివాహం రద్దు కాలేదు. రత్న పాఠక్‌ను పెళ్లి చేసుకునే అవకాశం లేకపోవడంతో ఆమెతో సహజీవనం సాగించారు. దాదాపు ఏడేళ్ల పాటు వీరి లివింగ్ రిలేషన్‌షిప్ కొనసాగింది. 1982లో వీరిద్దరు వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వీరికి ఇమాద్ షా, వివాన్ షా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. తమ వివాహబంధానికి 40 దశాబ్దాలు పూర్తైనా షా, పాఠక్ తమ నటనా జీవితాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు.
చదవండి: హీరో నాని ఎంత మందికి ఐలవ్యూ చెప్పాడో తెలుసా?
దిగ్గజ నటుడు
ఉత్తరప్రదేశ్‌లోని బారబాంకీ పట్టణానికి చెందిన నసీరుద్దీన్ షా.. చదువు పూర్తైన తర్వాత నటనలోకి అడుగుపెట్టారు. రాజేంద్ర కుమార్, సైరా బాను నటించిన అమన్ (1967) సినిమాతో తెరంగ్రేటం చేశారు. నిషాంత్, జునూన్, స్పర్శ్, ఆక్రోస్, మసూమ్, మిర్చ్ మసాలా, త్రికాల్, అర్థ్ సత్య, హమ్ పాంచ్ తదితర సినిమాల్లో నటించి గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, రచయితగానూ ఆయన రాణించారు. ఉత్తమ నటుడిగా మూడు సార్లు జాతీయ, ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. ఆయన ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో గౌరవించింది.