
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు పొమ్మంది, ప్రాణంగా చూసుకున్న భార్య తరిమేసింది. ఎక్కడికి వెళ్లాలో తోచని స్థితిలో కొంతకాలం వృద్ధాశ్రమంలో గడిపాడు ప్రముఖ మలయాళ నటుడు కొల్లం తులసి (Kollam Thulasi). తాజాగా ఈ విషయాన్ని గాంధీ భవన్ ఆశ్రమంలో జరిగిన ఓ ఈవెంట్‌లో బయటపెట్టాడు. కొల్లం తులసి మాట్లాడుతూ.. నేను ఈ ఆశ్రమంలో ఆరునెలలు ఉన్నాను. అందరూ ఉన్న ఒంటరివాడినై ఇక్కడ చేరాను.
భార్య, కూతురు వదిలేశారు
నా భార్య నన్ను వదిలేసింది. నా కూతురు కూడా వదిలించుకుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న నా బిడ్డకు నేను పరాయివాడినైపోయాను. తనొక ఇంజనీర్. ఆస్ట్రేలియాలో సెటిలైంది. వాళ్లు నాకు కనీసం ఫోన్ కూడా చేయరు. నన్ను చూసి అసహ్యించుకుంటారు, ద్వేషిస్తారు. ఈ ఆశ్రమంలో నాతో పాటు పని చేసిన ఓ గొప్ప నటి కూడా ఉంది. ఎంతో కష్టపడి పిల్లలను చదివించింది. కుటుంబాన్ని పోషించింది. నటిగా రాష్ట్రస్థాయిలో అవార్డు గెల్చుకుంది.
తల్లిని వదల్లేక కుటుంబాన్ని..
కానీ, ఇప్పుడు తను కూడా ఇదే ఆశ్రమంలో ఉంటోంది. తనకు వయసుపైబడ్డ తల్లి ఉంది. ఆమెను వదిలించుకోమని ఇంట్లోవాళ్లు చెప్పారు. కన్నతల్లిని అనాథలా వదిలేసేందుకు ఆమెకు మనసొప్పలేదు. బయటకు వెళ్లి బతికేంత స్థోమత లేదు. అందుకే భర్తను, పిల్లల్ని వదిలేసి తల్లిని తీసుకుని ఆశ్రమానికి వచ్చింది. మనుషులు ఎప్పుడెలా మారిపోతారో మనకు తెలియదు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది అందరికీ ఓ గుణపాఠం అని చెప్పుకొచ్చాడు.
ఇది ఒక గుణపాఠం
కొల్లం తులసి.. కిరీటం, జాగ్రత్త, అర్థం, గాడ్ ఫాదర్ (1991), ద కింగ్, సత్యం, రావణన్, ఆయుధం, ద్రోణ 2010, రింగ్ మాస్టర్.. వంటి పలు చిత్రాల్లో నటించాడు. థియేటర్ ఆర్టిస్ట్ లవ్లీ బాబు.. ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, నలు పెన్నుంగళ్, భాగ్యదేవత, మేరిక్కుండోరు కుంజాడు, తన్మత్ర, పుతియ ముఖం, ప్రణయం వంటి పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తల్లిని చూసుకోవడం కోసం సినిమాలు కూడా మానేసింది.
చదవండి: ఎంతో ఒత్తిడి, బాధ అనుభవించా.. నాకు పెళ్లి వల్ల గుర్తింపు రాలేదు!