ఏడుగురు సీఎంలతో నటించిన ఏకైక నటి.. ఇంతకీ ఎవరీమె? | Aachi Manorama Acted With Seven Chief Ministers Include Vijay | Sakshi
Sakshi News home page

Aachi Manorama: ఎన్టీఆర్ నుంచి స్టాలిన్ వరకు.. ముఖ్యమంత్రులతో నటించి రికార్డ్

May 8 2026 3:14 PM | Updated on May 8 2026 3:28 PM

Aachi Manorama Acted With Seven Chief Ministers Include Vijay

తమిళనాడు రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్. హీరో విజయ్ ముఖ్యమంత్రి అవుతాడా లేదా అని చిన్నపాటి టెన్షన్. అన్నీ కలిసొస్తే ఇతడే సీఎం కావొచ్చు. అయితే విజయ్‌తోపాటు మరో ఆరుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన నటి మనోరమ గురించి మీలో ఎంతమందికి తెలుసు.  ఇంతకీ ఎవరీ నటి? ఏ సీఎంలతో ఏయే సినిమాలు చేసిందంటే?

నాటకాలతో మొదలుపెట్టి తెలుగు, తమిళంలో 1000కి పైగా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న మనోరమ.. 1950 నుంచి 2015 వరకు నటిస్తూనే ఉన్నారు. మూడు తరాల నటులతో కలిసి నటించిన ఈమె.. తమిళ ఇండస్ట్రీలో పోషించని పాత్ర లేదనే స్థాయికి ఎదిగారు. అసలు విషయానికొస్తే తమిళనాడు ముఖ్యమంత్రుల్లో అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్‌, జయలలిత, స్టాలిన్‌తో పాటు దిగ్గజ హీరో, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌తోనూ నటించారు. విజయ్‌తోనూ తెరని పంచుకున్నారు. విజయ్ ముఖ్యమంత్రి అయితే ఏడుగురి సీఎంలతో కలిసి నటించిన ఘనత ఈమె సొంతమవుతుంది.

అన్నాదురై
ద్రవిడ ఉద్యమ సిద్ధాంతాలని నాటకాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లిన సీఎన్ అన్నాదురైతో మనోరమకు ప్రత్యేక అనుబంధముంది. ఈయన రచించి నటించిన వేలైక్కారి, శివాజీ కండ హిందూ సామ్రాజ్యం తదితర నాటకాల్లో ఈమె, అన్నాదురై కలిసి నటించారు.

కరుణానిధి
నాటకాల్లో మనోరమ ప్రతిభని గుర్తించిన నటుడు ఎస్ఎస్ రాజేంద్రన్.. ఈమెని చెన్నై తీసుకెళ్లి, కరుణానిధి రచించిన 'మణిమగుడం' నాటకంలో నటించే అవకాశమిచ్చారు. 'ఉదయ సూరియన్' నాటకంలో కరుణానిధితో కలిసి మనోరమ ప్రధాన పాత్ర పోషించడం విశేషం.

ఎంజీఆర్‌
నాటకాల నుంచి సినిమాలకు వచ్చిన మనోరమ.. ఎమ్‌జీ రామచంద్రన్ అలియాస్ ఎంజీఆర్‌‌తో పలు హిట్ సినిమాల్లో నటించారు. అన్బేవా, పదగొట్టి తదితర చిత్రాల్లో ఈమె కామెడీ టైమింగ్ ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించింది.

జయలలిత
జయలలితతోనూ మనోరమ చాలా సినిమాల్లో నటించారు. కందన్ కరుణై, గలట్టా కల్యాణం, పట్టికాడ పట్టణమ చిత్రాల్లో వీరి నటన ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. సినిమాల్లోనే కాకుండా బయట కూడా వీళ్లిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉండేదని చెబుతుంటారు

స్టాలిన్
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా కొన్ని సినిమాల్లో నటించారు. అలా ఈయన విజయ్‌కాంత్ హీరోగా చేసిన 'మక్కళ్ అనైయిట్టల్' చిత్రంలో మనోరమతో కలిసి తెర పంచుకున్నారు.

ఎన్టీఆర్‌
తమిళంలో ఇలా ఐదుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన మనోరమ.. తెలుగులో ఎన్టీఆర్‌తోనూ కలిసి తెర పంచుకున్నారు. నర్తనశాల, పాతాళభైరవి, గుండమ్మ కథ, మాయా బజార్, ఛాలెంజ్ రాముడు తదితర చిత్రాల్లో కలిసి నటించారు.

విజయ్‌(ఇంకా సీఎం కాలేదు)
తమిళనాడులో ప్రస్తుతం విజయ్ సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇతడితోనూ మనోరమ కలిసి నటించారు. రసిగన్, దేవా లాంటి సినిమాల్లో వీరి కాంబినేషన్ ప్రేక్షకులను అలరించింది.

1937 మే 26న మన్నార్‌గుడిలో పుట్టిన మనోరమ అసలు పేరు గోవిందమ్మాళ్. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా కారైకుడి ప్రాంతానికి వలస వెళ్లింది. కేవలం 12 ఏళ్ల వయసులోనే 'యార్ మగన్' అనే నాటకంతో రంగస్థల నటిగా ప్రస్థానం మొదలుపెట్టింది. 1958లో వచ్చిన 'మళయిట్ట మాంగై' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే సినిమాల్లోకి రాకముందే తన డ్రామా ట్రూప్ మేనేజర్ ఎస్ఎమ్ రామనాథన్‌తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. వీళ్లకు భూపతి అనే కొడుకు కూడా పుట్టాడు. తర్వాత కొన్నాళ్లకు ఈమెకు భర్త విడాకులు ఇచ్చేశాడు. 2015 అక్టోబరులో 78 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో ఈమె కన్నుమూసింది.

Advertisement
 
Advertisement
Advertisement