‘ఆదర్శ’ హాస్టళ్ల బాధ్యతల నుంచి ఎస్వోల తొలగింపు!
మంచిర్యాలఅర్బన్: తెలంగాణ మోడల్ స్కూళ్లకు అనుబంధంగా ఉన్న బాలికల వసతిగృహ నిర్వహణ బాధ్యతల నుంచి కేజీబీవీ ఎస్వోలను తొలగించారు. ఇదివరకు డీపీవో, ఫైనాన్స్, అకౌంట్స్ ఆఫీసర్, సమీప కేజీబీవీ ఎస్వో నిర్వహించే బాలికల హాస్టల్ ఉమ్మడి ఖాతాను ఇక నుంచి డీపీవో ఫైనా న్స్, అకౌంట్స్, మోడల్ స్కూల్స్‌కు అనుబంధంగా ఉన్న బాలికల హాస్టళ్ల కేర్‌టేకర్ కమ్ వార్డెన్ నిర్వహించనున్నారు. గర్ల్స్ హాస్టల్ ప్రాంగణాల శుభ్రతను మోడల్‌స్కూల్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పారిశుధ్య కార్మికులు చూడనున్నారు. ప్రాంగణ నిర్వహణ నిర్ధారించే బాధ్యతలను మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్‌కు అప్పగించారు. చిన్న మరమ్మతులు, ఇతర సమస్యల పరిష్కార బాధ్యతలు కేర్ టేకర్ కమ్ వార్డెన్‌తో పాటు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, ఎంఈవో, జిల్లా జెండర్ అండ్ ఈక్విటీ కో–ఆర్డినేటర్లతో కూడిన నలుగురు సభ్యుల కమిటీ చూడనుంది. హాస్టల్ విద్యార్థినులతో వారానికోసారి సమావేశం నిర్వహించాలని మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక నుంచి హాస్టల్ బాధ్యతలు కేర్ టేకర్ కమ్ వార్డెన్లు పర్యవేక్షించనున్నారు.
కేజీబీవీ ఎస్వోలకు ఊరట
జిల్లాలో ఐదు ఆదర్శ పాఠశాలలుండగా అనుబంధంగా వసతిగృహాలు ఏర్పాటు చేశారు. బాలికల విద్యను ప్రోత్సహించాలని ప్రభుత్వం ఆర్‌ఎన్‌ఎస్‌ఏ ద్వారా వసతిగృహాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. తర్వాత కాలంలో సమగ్రశిక్షణ పరిధిలోకి తీసుకువచ్చి మోడల్‌స్కూల్ ప్రిన్సిపాల్‌కు ఎఫ్‌ఏవోకు చెక్‌పవర్ ఇచ్చారు. ఒక్కో వసతిగృహంలో 100 మంది విద్యార్థినులకు అవకాశం కల్పించారు. మొ దటి ప్రాధాన్యతలో కళాశాలల విద్యార్థినులకు వసతిగృహాల్లో చోటు కల్పిస్తున్నారు. అప్పట్లో మోడల్ స్కూల్ ప్రాంగణంలోని బాలికల వసతి గృహాల నిర్వహణ బాధ్యత తమది కాదని మోడల్‌స్కూల్ ప్రిన్సిపాల్స్ కోర్టు ద్వారా ఉత్తర్వుల పొందిన నేపథ్యంలో సమీప కేజీబీవీ ఎస్వోలకు నిర్వహణ బా ధ్యతలు కట్టబెట్టారు. అప్పట్లోనే ఆదర్శ పాఠశాలలకు అనుబంధంగా ఉన్న బాలికల వసతి గృహాల నిర్వహణ బాధ్యతలు సమీప కేజీబీవీ ఎస్వోలకు అప్పగించడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఓ వైపు కేజీబీవీ పాఠశాల, హాస్టల్, కళాశాల పర్యవేక్షించటంతో పాటు ఆదర్శ హాస్టళ్ల అదనపు భారం మోపడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తప్పుబట్టా యి. మోడల్ స్కూల్‌కు అనుబంధంగా ఏర్పాటు చేసిన హాస్టళ్లు దూరంగా ఉండటం, కేజీబీవీ బాధ్యతల నిర్వహణ కష్టతరంగా మారింది. ఎట్టకేలకు హాస్టల్ నిర్వహణ బాధ్యతల నుంచి వారిని తప్పించటం కేజీబీవీ ఎస్వోలకు ఊరటనిచ్చింది.


