
ఓపెన్ స్కూల్ ఓ వరం..
● చదువు మానేసిన వారికి మంచి అవకాశం ● పదోతరగతి, ఇంటర్‌లో ప్రవేశాలు ప్రారంభం ● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 84 కేంద్రాలు
లక్ష్మణచాంద(నిర్మల్): ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితుల వల్ల పాఠశాల స్థాయిలోనే పలువురు విద్యార్థులు చదువు మధ్యలోనే మానేస్తున్నారు. మరి కొందరు పదోతరగతి పూర్తయిన తరువాత ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో ఇంటర్ చదువు కొనసాగించలేకపోతున్నారు. ఇలాంటి వారి కోసం తెలంగాణ రాష్ట్ర ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) మళ్లీ చదువుకునే అవకాశం కల్పిస్తోంది. చదువు మధ్యలో మానేసిన విద్యార్థులు మళ్లీ చదువు కొనసాగించేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న ఓపెన్ స్కూల్, ఓపెన్ ఇంటర్ ఓ సువర్ణ అవకాశంగా చెప్పవచ్చు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఓపెన్ పదోతరగతి, ఓపెన్ ఇంటర్ అధ్యయన కేంద్రాలు 84 ఉన్నాయి. వాటిలో 7,078 మందికి ప్రవేశాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఓపెన్ తరగతుల్లో ప్రవేశాల కోసం ఎలాంటి విద్యార్హత లేదు. కనీస వయస్సు 15 ఏళ్లు నిండి ఉండాలి. ఆపై వయస్సు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌లో ప్రవేశాల కోసం తప్పనిసరిగా పదో తరగతి పాపై ఉండాలి. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా జూన్ 12 నుంచి జూలై 11 వరకు ప్రవేశం పొందవచ్చు. టీజీ ఆన్‌లైన్‌లో మీసేవ కేంద్రంలో ఫీజు చెల్లించి సమీపంలోని ఓపెన్ స్కూల్‌లో దరఖాస్తులు సమర్పించి అడ్మిషన్ తీసుకోవాలి. ఓపెన్ స్కూల్‌లో ఈ నెల 25 బుధవారం వరకు మొత్తం 71 దరఖాస్తులు వచ్చినట్లు ఓపెన్ స్కూల్ ఉమ్మడి ఆదిలాబాద్ కోఆర్డినేటర్ అశోక్ తెలిపారు. ఇందులో ఓపెన్ పదో తరగతికి ఉమ్మడి జిల్లాలో 47 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో 34 మంది అడ్మిషన్ ఫీజు చెల్లించారని పేర్కొన్నారు. ఓపెన్‌లో ఇంటర్‌లో సైన్స్ విభాగంలో 20 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో ఇప్పటి వరకు ఆరుగురు విద్యార్థులు అడ్మిషన్ ఫీజు చెల్లించారని, ఆర్ట్స్ విభాగంలో ఇప్పటి వరకు 41 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో 31 మంది అడ్మిషన్ ఫీజు చెల్లించారని తెలిపారు.
సెలవుల్లో తరగతులు...
ఓపెన్ పదో తరగతి, ఇంటర్‌లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఆయా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో తరగతులకు హాజరుకావాల్సి ఉంటుంది. వీరికి సెలవుల రోజుల్లో తరగతులు నిర్వహిస్తారు. రెండో శనివారం, ఆదివారం, ఇతర సెలవులు ఉన్న రోజుల్లో తరగతులు నిర్వహిస్తారు. విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు అధ్యయన కేంద్రాల్లోనే అందజేస్తారు.
ఉమ్మడి జిల్లా సమాచారం
జిల్లా అధ్యయన చేర్పించాల్సిన
కేంద్రాలు లక్ష్యం
నిర్మల్ 25 2,506 ఆదిలాబాద్ 22 1,696 మంచిర్యాల 17 1,974
కుమురంభీం 20 902
మొత్తం 84 7,078