గద్వాల క్రైం: ఏఆర్ కానిస్టేబుల్ నిర్వాకంపై జిల్లా కేంద్రంలోని ఓ బాధితుడు వాటర్ ట్యాంక్ పై నుంచి దూకి బలవన్మరణానికి యత్నించిన ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. బాధితుడు కథనం మేరకు.. బీసీ కాలనీకి చెందిన నరేష్ కుటుంబ వ్యవహారంలో ఏఆర్ కానిస్టేబుల్ బాలు తీరు వివాదస్పదంగా మారిందని కలత చెందినట్లు తెలిపాడు. కొన్ని రోజులుగా వ్యక్తిగత విషయాల్లో భార్యాభర్తల మధ్య సమస్యలు సృష్టించి బెదిరింపులకు పాల్పడుతున్నాడని వాపోయాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాధితుడు నరేష్ జిల్లా ప్రభుత్వాస్పత్రి వెనకాల ఉన్న వాటర్ ట్యాంక్‌పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడేందుకు యత్నించాడు. విషయం తెలుసుకున్న గద్వాల సీఐ శ్రీను అక్కడికి చేరుకుని బాధితుడితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో బాధితుడు క్షేమంగా కిందకు వచ్చాడు. ఈ విషయంపై విచారణ చేపట్టి ఏఆర్ కానిస్టేబుల్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.
ఏఆర్ కానిస్టేబుల్‌పై చర్యలు
తీసుకోవాలని డిమాండ్


