జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామం వద్ద బ్లాక్‌స్పాట్ రోడ్ వైండింగ్ కారణంగా మిషన్ భగీరథ పైపులైన్ మార్చడం కారణంగా 48గంటలపాటు మిషన్ భగీరథ నీళ్ల సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ శ్రీనివాస్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అడ్డాకుల మండలలోని 19 గ్రామాలకు, భూత్పూర్ మండలం లోని 11 గ్రామా లు, మూసాపేట మండలంలో 19 గ్రామాలకు మొత్తం 49 గ్రామాలకు నీటి సరఫరాలో అంతరాయము కలుగుతుందని తెలిపారు. అసౌకర్యానికి ప్రజలు సహకరించాలని కోరారు.
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): నగరంలోని 11 కేవీ పరిధి రైల్వే స్టేషన్ రోడ్డు ఫీడర్‌లో చెట్ల తొలగింపు కారణంగా గురువారం నగరంలో విద్యుత్ అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏడీ థావుర్యానాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో రైల్వేస్టేషన్ రోడ్, బాలుర కళాశాల, న్యూటౌన్, సద్దలగుండు, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని, ఈ అంతరాయానికి ప్రజలు సహకరించాలని కోరారు.
హెల్త్ క్యాంపు
సెంటర్‌కు శంకుస్థాపన
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో సుమారు రూ.30 లక్షలతో నిర్మించే హెల్త్ క్యాంపు సెంటర్‌కు బుధవారం మేయర్ మమత శంకుస్థాపన చేశారు. అలాగే డివిజన్ నం.14 పరిధిలోని మున్సిపల్ ఓల్డ్ క్వార్టర్స్, నల్‌బౌలి, ఖలీల్‌చౌక్, టీడీగుట్ట కమ్యూనిటీ హాల్, క్యూబా, బిల్లా మసీదు సమీప ప్రాంతాలను బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.రామాంజులరెడ్డి పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని వీలైనంత వరకు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో ఎంఈ మురళీమోహన్‌రెడ్డి, ఏఈ రాగవినతి, ఇన్‌చార్జ్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ వజ్రకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పెరిగిన ఉల్లి ధర
దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం జరిగిన వేలంలో ఉల్లి ధర మరింత పెరిగింది. వివిధ గ్రామాల నుంచి దాదాపు వెయ్యి బస్తాల ఉల్లి అమ్మకానికి రాగా.. వ్యాపారులు వేలం వేసి ధరలు నిర్ణయించారు. వేలంలో క్వింటాల్ ఉల్లి గరిష్టంగా రూ.2,110, కనిష్టంగా రూ.1,200 వరకు ధరలు లభించాయి. అలాగే 50 కిలోల బస్తా గరిష్టంగా రూ.1,100, కనిష్టంగా రూ.600 వరకు విక్రయించారు. మార్కెట్‌లో కేవలం ఉల్లి వ్యాపారం మాత్రమే కొనసాగింది.
ఆర్‌ఎన్‌ఆర్ @ రూ.2,756
జడ్చర్ల: బాదేపల్లిలోని వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ రకం క్వింటా గరిష్టంగా రూ.2,756, కనిష్టంగా రూ.1,706 ధరలు లభించాయి. అలాగే మొక్కజొన్న క్వింటా గరిష్టంగా రూ.2,056, కనిష్టంగా రూ.1,601 చొప్పున పలికాయి.


