
గురుకుల విద్యార్థుల ఆందోళన
● కలెక్టర్‌ను కలిసేందుకు ప్రహరీ దూకిన వైనం
● పాఠశాలకు చేరుకొని విద్యార్థులతో సమావేశమైన కలెక్టర్
వనపర్తి రూరల్: పాఠశాలలో నెలకొన్న సమస్యలను కలెక్టర్‌కు విన్నవించేందుకు మంగళవారం మండలంలోని చిట్యాల ఎంజేపీ గురుకుల బాలుర పాఠశాల పదోతరగతి విద్యార్థులు ప్రహరీ దూకి వనపర్తి వైపు పంట చేనుల్లో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పట్టణంలో తిరిగి వెదికి పట్టుకున్నారు. పాఠశాలకు రావాలని కోరగా కలెక్టర్‌ను కలిసేదాకా వచ్చేది లేదని పట్టుబట్టడంతో సర్ధిచెపి ఆటోలో పాఠశాలకు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, ఆర్‌సీఓ శ్రీనివాసులు, సీఐ కృష్ణయ్య, తహసీల్దార్ రమేష్‌రెడ్డి పాఠశాలకు చేరుకొని విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం కలెక్టర్ ఆదర్శ్ సురభి పాఠశాలను సందర్శించి నేరుగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. పాఠశాలలో మెనూ సరిగా పాటించడం లేదని, ఆటలు ఆడించకుండా రాత్రి 10 వరకు చదివిస్తున్నారని, తల్లిదండ్రులను కలవనీవడం లేదని ఫిర్యాదు చేశారు. పాఠశాలో ఫిర్యాదు పెట్టె ఏర్పాటు చేయిస్తానని.. ఏవైనా సమస్యలుంటే అందులో వేయాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా కల్పించారు. విద్యార్థులకు స్వేచ్ఛాయుత వాతావరణంలో విద్యనందించాలని, సృజనాత్మకత, నైతిక విలువలు నేర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. నాణ్యమైన బోధనతో పాటు ప్రేమాభిమానం చూపించాలన్నారు. క్రీడల్లో రాణించేలా తీర్చిదిద్దాలని, జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పోటీపడేలా తయారు చేయాలని కోరారు. మధ్యాహ్న భోజనం పరిశీలించి విద్యార్థులతో కలిసి భుజించారు.

గురుకుల విద్యార్థుల ఆందోళన