
బావిలో పడి ఇద్దరు దుర్మరణం
● మృతుల్లో ఓ యువకుడు, ఓ బాలుడు
● సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఘటన
హుజూర్‌నగర్: యువకుడు బావిలో పడిపోగా.. అతడిని కాపాడబోయి మరో యువకుడు అందులోకి దిగాడు. ప్రమాదవశాత్తు ఇద్దరూ నీట మునిగి మృతిచెందారు. ఈ విషాదకర ఘటన శుక్రవారం హుజూర్‌నగర్‌లో చోటుచేసుకుంది, స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామానికి చెందిన కన్మనూర్ తిరుపతయ్య, మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం చందాపూర్ గ్రామానికి చెందిన మోదిపురం లక్ష్మణ్‌లు మరో ఆరుగురితో కలిసి గొర్రెలను మేపుకుంటూ హుజూర్‌నగర్‌కు వచ్చారు. గత పది రోజులుగా పట్టణానికి చెందిన జక్కుల లింగయ్య పొలంలో మేత కోసం గొర్రెలను నిలిపి అక్కడే ఉంటున్నారు. నాలుగు రోజుల క్రితం తిరుపతయ్య కుమారులైన శేఖర్, చరణ్ వేసవి సెలవులు కావడంతో తండ్రి వద్దకు వచ్చారు. శుక్రవారం తిరుపతయ్య పెద్ద కుమారుడైన శేఖర్, గొర్రెల కాపరి లక్ష్మణ్‌తో కలిసి నీటిని తీసుకువచ్చేందుకు సమీపంలో గల లింగయ్య బావి వద్దకు వెళ్లారు. లక్ష్మణ్ (21) నీళ్లు పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడిపోయాడు. అతడిని కాపాడేందుకు శేఖర్ (14)ప్రయత్నించగా అతను కూడా బావిలో పడ్డాడు. దీంతో ఇద్దరూ నీట మునిగి మృతిచెందారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. మృతుడు శేఖర్ తండ్రి తిరుపతయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ముత్తయ్య తెలిపారు.

బావిలో పడి ఇద్దరు దుర్మరణం

బావిలో పడి ఇద్దరు దుర్మరణం