ఓటర్లు పెరిగినా ఓట్లు తగ్గాయి | Sakshi
Sakshi News home page

ఓటర్లు పెరిగినా ఓట్లు తగ్గాయి

Published Mon, May 27 2024 10:05 PM

-

తొలి ఐదు విడతల పోలింగ్‌లో దేశవ్యాప్తంగా 428 లోక్‌సభ స్థానాల పరిధిలో ఓటర్లు తమ నిర్ణయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఆ స్థానాల్లో 50.7 కోట్ల ఓట్లు పోలైనట్లు ఈసీ తెలిపింది. గత ఎన్నికల్లో తొలి ఐదు విడతల్లో 426 స్థానాల్లో ఏకంగా 70.1 కోట్ల మంది ఓటేయడం విశేషం. అప్పుడు 68 శాతం ఓటింగ్‌ నమోదైతే ఈసారి 66.4 శాతానికి పరిమితమైంది. వాస్తవానికి 2019 ఎన్నికల్లో దేశంలో మొత్తం ఓటర్లు 89.6 కోట్లుండగా ఈసారి 96.8 కోట్లకు పెరిగారు. 7.2 కోట్ల మంది కొత్త ఓటర్లు జతైనా ఓటింగ్‌ మాత్రం పడిపోవడం గమనార్హం. ఈసారి తొలి విడత నుంచే ఓటింగ్‌లో తగ్గుదల ధోరణి కొనసాగుతోంది. చివరి రెండు విడతల్లోనూ ఇదే ట్రెండ్‌ ఉంటే మొత్తం ఓటింగ్‌ గత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నమోదైన 67.4 శాతానికి చాలాదూరంలో నిలిచిపోయేలా కనిపిస్తోంది. (ప్రాథమిక డేటా ప్రకారం ఆరో విడతలో 63.36 శాతం పోలింగ్‌ నమోదైంది. 2019లో ఇది 64.73 శాతం).

20 రాష్ట్రాలు, యూటీల్లో డౌన్‌...

దు విడతల పోలింగ్‌ను పరిశీలిస్తే ఏకంగా 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటింగ్‌ తగ్గింది. నాగాలాండ్‌లో పలుచోట్ల ఎన్నికల బహిష్కరణ పిలుపుల నేపథ్యంలో ఓటింగ్‌ బాగా తగ్గింది. గత ఎన్నికల్లో 82.9 శాతం నమోదు కాగా ఈసారి ఏకంగా 57.7 శాతానికి పడిపోయింది. మిజోరం, కేరళల్లో పోలింగ్‌ 6 శాతం మేర తగ్గింది. మణిపూర్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌ల్లో 4 శాతం పైగా తగ్గింది. షాదోల్‌, రేవా, ఖజురహో, సిద్ధి (మధ్యప్రదేశ్‌), పథనంతిట్ట (కేరళ), మథుర (యూపీ) లోక్‌సభ స్థానాల్లోనైతే 10 శాతానికి పైగా పడిపోయింది. రాహుల్‌ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్‌లో 2019తో పోలిస్తే 6.76 శాతం తగ్గింది!

కశ్మీర్లో పోటెత్తారు...

దేశవ్యాప్తంగా ట్రెండ్‌కు భిన్నంగా కొన్ని రాష్ట్రాలు, నియోజకవర్గాల్లో ఓటర్లు పోటెత్తారు. ముఖ్యంగా జమ్మూ కశ్మీర్‌, మేఘాలయ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, కర్నాటకల్లో ఓటింగ్‌ బాగా పెరిగింది. జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా, శ్రీనగర్‌ నియోజకవర్గాల్లో గత ఎన్నికల కంటే ఏకంగా 24 శాతం అధిక ఓటింగ్‌ నమోదైంది. మేఘాలయలోని షిల్లాంగ్‌లో 8.31 శాతం పెరిగింది. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
 
Advertisement
 
Advertisement