పురాతన వస్తువులు.. వరదపాలు
హన్మకొండ కల్చరల్ : చరిత్రకు అర్థం చెప్పడానికి, సంరక్షించడానికి, ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు గతం గురించి లోతైన అధ్యయనానికి ఉపయోగపడే వెలకట్టలేని అపురూపమైన పురాతన వస్తువులు, కళాఖండాలు వరదపాలయ్యాయి. మూడ్రోజుల క్రితం మహానగరాన్ని ముంచెత్తిన వరదలో వరంగల్ హంటర్‌రోడ్‌లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, జానపద గిరిజన విజ్ఞానపీఠం వరదనీటితో ముంపునకు గురైంది. పీఠం గ్రౌండ్‌ఫ్లోర్‌లోని మ్యూజియం మునిగి పోవడంతో 30ఏళ్ల నుంచి సేకరించిన పురాతన వస్తువులు, కళాఖండాలు నీటిలో మునిగిపోవడంతో వాటిని సేకరించిన పీఠం సిబ్బంది ఆవేదన చెందారు. అరుదైన జానపదులు, గిరిజనులు ఉపయోగించిన పురాతన చారిత్రక వస్తువులు, కళాఖండాలు, పూర్వకాలంలో ఉపయోగించిన లోహ, చెక్క సంబంధించిన వంట, ఇంటి సామగ్రి, పనిముట్లు తదితర విలువైన వస్తువులు రెండ్రోజుల పాటు నీటిలో ఉండటంతో పనికి రాకుండా పోయాయి. 2023 జూన్, జూలైలో వచ్చిన అధిక వర్షాల వల్ల ఏర్పడిన వరదలతో పీఠంలోని మ్యూజియం మునిగిపోయింది. దీంతో సగం పైగా వస్తువులు తడిసిపోయాయి.. సిబ్బంది చొరవతో మిగిలిన వస్తువులను శుభ్రపరిచి క్రమపద్ధతిలో అమర్చి భద్రపరిచారు. ప్రస్తుతం మూడ్రోజుల నుంచి ముంపునకు గురికావడంతో పరిశోధకులు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంస్కృతి, సంప్రదాయాలను గుర్తించడానికి, పరిశోధనలు నిర్వహించడానికి సేకరించిన వస్తువులు పనికి రాకుండాపోవడం బాధాకరమని గిరిజన విజ్ఞానపీఠం అధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న పేర్కొన్నారు. పీఠానికి కళాభరణంగా ఉండే మ్యూజియాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ప్రభుత్వం సహకరించాలని కోరారు.
● ముంపునకు గురైన మ్యూజియం
● నీట మునిగిన జానపద గిరిజన విజ్ఞానపీఠం
పురాతన వస్తువులు.. వరదపాలు
పురాతన వస్తువులు.. వరదపాలు
పురాతన వస్తువులు.. వరదపాలు


