విధుల్లో అలసత్వం వహించొద్దు
నెహ్రూసెంటర్: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో విధుల్లో అలసత్వం వహించినా.. సమయ పాలన పాటించకపోయినా చర్యలు తప్పవని మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ హెచ్చరించారు. బతికుండగానే మార్చురీలో పెట్టిన ఘటనపై ఆస్పత్రి వైద్యులతో శనివారం ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆస్పత్రిలో నర్సులు కాలక్షేపం చేస్తూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో పని చేయిస్తున్నారని తన దృష్టికి వచ్చిందని, ఒక్క ఉద్యోగి కూడా డ్యూటీలో సెల్‌ఫోన్ ఉపయోగించరాదని చెప్పారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించేలా దృష్టి సారించాలని తెలిపారు. అమానవీయ సంఘటనలు పునరావృతం అయితే సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్, ఆర్‌ఎంఓపై చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.
ఇద్దరిపై వేటు..
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో బతికుండగానే మార్చురీలో పెట్టిన సంఘటనలో ఇద్దరు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులపై వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ బతికుండగానే మార్చురిలో పెట్టారని, సిబ్బంది అలత్వం వీడి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు.
అంకితభావంతో పనిచేయాలి
మహబూబాబాద్ రూరల్ : వ్యవసాయ శాఖ అధికారులు అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ అన్నారు. వ్యవసాయ శాఖ అధికారులతో జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీనాయక్ మాట్లాడుతూ.. మోంథా తుపానుతో నియోజకవర్గ వ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయన్నారు. ఏ ఒక్క రైతుకు నష్టం జరగకుండా పంట నష్టం అంచనా వేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో డీఏఓ విజయనిర్మల, ఏడీఏ శ్రీనిసరావు, ఏఓ తిరుపతిరెడ్డి, వివిధ మండలాల ఏఓలు పాల్గొన్నారు.
సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మురళీనాయక్
బతికుండగానే మార్చురీలో పెట్టిన ఘటనపై స్పందన
ఇద్దరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై వేటు


