
సాగు.. బాగు
మహబూబాబాద్ రూరల్: ఆయిల్‌పామ్ పంట సాగు చేసిన రైతులు మంచి దిగుబడులు సాధించి, ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,535 మంది రైతులు 6,585 ఎకరాల్లో పంట సాగు చేశారు. కాగా ప్రస్తుతం ఆరుగురు రైతులు 85 ఎకరాల విస్తీర్ణంలో పంట దిగుబడులు తీశారు. జిల్లాలోని కురవి, తొర్రూరు, నెల్లికుదురు, చిన్నగూడూరు, డోర్నకల్ మండలాల్లో ఉన్న రైతుల క్షేత్రాల్లో ఆయిల్ పామ్ పంటలు దిగుబడులను తీసి మార్కెట్‌కు తరలించి అధిక ఆదాయం పొందుతున్నారు.
టన్నుకు రూ.13,726..
మొదటిసారి గెలలు కోసిన రైతులు.. ఎకరానికి ఐదు నుంచి ఆరు టన్నుల ఆయిల్‌పామ్ పంట దిగుబడులు సాధించారు. మార్కెట్‌లో టన్నుకు ధర రూ.13,726 పలుకుతోంది. ఈమేరకు ఎకరాకు రూ.70వేలకు పైగా ఆదాయం వస్తున్నట్లు జిల్లా ఉద్యానశాఖ అధికారులు తెలుపుతున్నారు.
మరో 370 ఎకరాల్లో కోతలకు సిద్ధం..
జిల్లాలో 45 మంది రైతుల 370 ఎకరాల తోటలు కోతకు సిద్ధంగా ఉన్నాయి. జూన్ నెలలో కోతలు కోసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఇటీవల జిల్లాలోని తొర్రూరు మండలం గోపాలగిరి రెవెన్యూ పరిధిలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. 2027వరకు ఈ ఫ్యాక్టరీని అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రూ.75 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టనున్న ఫ్యాక్టరీలో గంటకు 30 నుంచి 60 టన్నుల గెలలను క్రష్ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
జిల్లాలో 6,585 ఎకరాల్లో
ఆయిల్ పామ్‌సాగు
మంచి దిగుబడులతో రైతులకు
ఆదాయం