
పత్తికొండలో అడుగడుగునా అడ్డంకులు
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు పత్తికొండలో నిర్వహించిన అన్నదాత పోరు కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. అయినప్పటికీ రైతుల తరఫున వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆధ్వర్యంలో పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్‌రెడ్డి, మహిళ విభాగం రాష్ట్ర కార్యదర్శి శశికళ, మాజీ ఎంపీపీ నాగరత్నమ్మలతో కలసి ర్యాలీగా వచ్చి నాలుగు స్థంభాల కూడలిలో ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్‌డీఓ కార్యాలయానికి చేరుకోని ఆర్‌డీఓ భరత్‌నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు అన్నదాత పోరుబాటపై ఆంక్షలు విధించారు. ర్యాలీని అనుమతి కోరినా చివరి వరకు ఇవ్వకుండా జాప్యం చేశారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ఆమె నివాసం నుంచి ఆర్‌డీఓ కార్యాలయం చేరుకోగా.. ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి అంబేద్కర్ సర్కిల్ నుంచి ఆర్‌డీఓ కార్యాలయానికి వెళ్లారు. నాయకులు అక్కడికి చేరుకోగానే మద్దతుగా అన్నదాతలు ఒక్కసారిగా కదలిరావడంతో ఆర్‌డీఓ కార్యాలయ ప్రాంగణం కిక్కిరిసింది. ఈ కార్యక్రమాన్ని పోలీసులు డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం గమనార్హం.